ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు..

31 Jan, 2021 15:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గత నెలలో శ్రీలంక పర్యటనకు బయల్దేరిన సందర్భంగా కోవిడ్‌ బారిన పడ్డ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ, ఆతరువాత తాను ఎదుర్కొన్న భాయానక అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టు సభ్యులందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో తనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో, 14 రోజుల పాటు హోటల్‌ గదిలో క్వారంటైన్‌లో ఉన్నానని, ఆ రోజులను తలచుకుంటుంటే ఇప్పటికీ భమయమేస్తుందని ఆయన వెల్లడించాడు. 

కోవిడ్‌ ప్రభావం వల్ల తీవ్ర అలసటకు లోనయ్యానని, అలాంటి పరిస్థితి తన జీవితంలో మునుపెన్నడూ ఎదురుకాలేదని పేర్కొన్నాడు. రుచిని కోల్పోవడంతో పాటు, తలనొప్పి, గొంతులో మంట లాంటి సమస్యల వల్ల తీవ్ర అలసటకు గరుయ్యానన్నాడు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆ సందర్భంగా భగవంతున్ని ప్రార్ధించానన్నాడు. అయితే ఆ భయానక పరిస్థితులను ఎంతో స్థైర్యంతో ఎదుర్కొన్నానని, కష్ట కాలం పూర్తయ్యేవరకు ఓపిగ్గా వ్యవహరించానని తెలిపాడు. 

కష్టకాలం తరువాత సుఖాలు ఉంటాయనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని మొయిన్‌ అలీ చెప్పుకొచ్చాడు. హోటల్‌ గదిలో ఒంటరిగా గడపడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని, దానిని నుంచే బయటపడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని తన అనుభవాలను పంచుకున్నాడు. కాగా, మొయిన్‌ అలీ ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగబోయే తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా జరుగనున్నాయి.  
 

మరిన్ని వార్తలు