NZ VS SL 1st Test: ఆసీస్‌ మ్యాచ్‌తో సంబంధం లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్‌

13 Mar, 2023 12:23 IST|Sakshi

డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్‌ మాజీ సారధి కేన్‌ విలియమ్సన్‌ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్‌ సెంచరీ సాధించిన కేన్‌ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్‌ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి, తన జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 

మరోపక్క ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్‌ విజయావకాశాలు సన్నగిల్లడంతో,  న్యూజిలాండ్‌-శ్రీలంక తొలి టెస్ట్‌ ఫలితంపై డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఆధారపడి ఉండింది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లోనూ శ్రీలంక గెలిచి ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది.

అయితే, తొలి టెస్ట్‌లోనే లంక ఓటమిపాలుకావడంతో ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. శ్రీలంక నిర్ధేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. కేన్‌ విలియమ్సన్‌ (121 నాటౌట్‌), డారిల్‌ మిచెల్‌ (81) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆఖరి బంతికి విజయాన్ని ఖరారు చేసుకుంది. ముఖ్యంగా కేన్‌ మామ అన్నీ తానై వ్యవహరించి, చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్‌కు విన్నింగ్‌ రన్‌ ఎక్స్‌ట్రా (బై) రూపంలో రావడం విశేషం. 

స్కోర్‌ వివరాలు..
శ్రీలంక: 355 & 302
న్యూజిలాండ్‌: 373 & 285/8
ఫలితం: 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం
 

మరిన్ని వార్తలు