NZ VS SL 2nd T20: సీఫర్ట్‌ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే

5 Apr, 2023 11:43 IST|Sakshi

డునెడిన్‌ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్‌ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య  జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్‌ 8న క్వీన్స్‌ టౌన్‌లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

నిప్పులు చెరిగిన ఆడమ్‌ మిల్నే..
రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన కివీస్‌.. ఫాస్ట్‌ బౌలర్‌ ఆడమ్‌ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్‌ చేసింది. మిల్నేతో పాటు బెన్‌ లిస్టర్‌ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్‌ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్‌ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్‌ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్‌ మెండిస్‌ (10), కుశాల్‌ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37),  అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్‌ సాధించగలిగారు. 

టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసం..
142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. టిమ్‌ సీఫర్ట్‌ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్‌ బోవ్స్‌ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్‌ లాథమ్‌ (30 బంతుల్లో 20 నాటౌట్‌; ఫోర్‌) కూడా రాణించడంతో కివీస్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్‌ బోవ్స్‌ వికెట్‌ కసున్‌ రజితకు దక్కింది.   

మరిన్ని వార్తలు