ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్‌' పనికిరాదు

28 Feb, 2023 10:50 IST|Sakshi

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజునే డిక్లేర్‌ చేయడం చూసి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. కానీ రెండో రోజుకే మ్యాచ్‌ ఫలితం వచ్చేసింది. తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్‌కు బజ్‌బాల్‌ క్రికెట్‌(Bazball) బాగా ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. ఇదే బజ్‌బాల్‌ క్రికెట్‌ మంత్రంతో వరుసగా సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లను మట్టికరిపించింది. 

కానీ ప్రతీసారి అదే దూకుడు పనికి రాదని తర్వాతి టెస్టుతోనే అర్థమైంది. ఓటమి నేర్పిన పాఠంతో బజ్‌బాల్‌(Bazball) ఆటను పక్కనబెడితే మంచిదని కొంతమంది క్రీడానిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈసారి కూడా ఇంగ్లండ్‌ ఆటను వేగంగానే మొదలుపెట్టింది. రూట్‌, హ్యారీ బ్రూక్‌ శతకాలతో విరుచుకుపడడంతో 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్‌ చేసి ఫాలోఆన్‌ కూడా ఆడించింది. ఇన్నింగ్‌ తేడాతో గెలవాలన్న  ఇంగ్లండ్‌  ప్లాన్‌ బెడిసికొట్టింది.

కేన్‌ విలియమ్సన్‌ శతకంతో మెరవగా.. టామ్‌ బ్లండెల్‌, టామ్‌ లాథమ్‌, డెవన్‌ కాన్వే, డారిల్‌ మిచెల్‌లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 483 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ముందు 258 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బజ్‌బాల్‌ మంత్రంతో ఊగిపోతున్న ఇంగ్లండ్‌ ఆటను చూస్తే టార్గెట్‌ అంత కష్టమేమి అనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే రూట్‌ తన శైలికి భిన్నంగా వేగంగా ఆడడంతో ఇంగ్లండ్‌ లక్ష్యం దిశగా సాగినట్లే అనిపించింది. కానీ ప్రతీసారి దూకుడు పనికిరాదన్న విషయం ఇంగ్లండ్‌కు అర్థమైంది.

రూట్‌ మినహా మిగతావాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. అయితే కాస్త ఓపికగా ఆడి ఉంటే మాత్రం ఇంగ్లండ్‌.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేదే. కానీ సంప్రదాయ ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. బజ్‌బాల్‌ అంటూ దూకుడు మంత్రం జపిస్తున్న ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్‌ తమ ఆటతో బ్రేకులు వేసింది. దీంతో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌(Bazball Cricket)ను పక్కనబెట్టడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చదవండి: పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు ‍కనుమరుగు

టెస్టు క్రికెట్‌లో సంచలనం.. పరుగు తేడాతో విజయం

మరిన్ని వార్తలు