T20 WC 2024: ‘అలా అయితేనే షమీ టీ20 ప్రపంచకప్‌ ఆడతాడు.. లేదంటే!’

2 Dec, 2023 16:13 IST|Sakshi

అనూహ్య రీతిలో వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా వెటరన్‌ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. 

పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా మూడో ఆప్షన్‌గా తుది జట్టులో చోటు సంపాదించిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. 7 మ్యాచ్‌లలో కలిపి 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ షమీ రికార్డు సృష్టించాడు.

సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఇలా సత్తా చాటిన షమీ ప్రస్తుతం చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. 

అదే విధంగా టెస్టు జట్టులోనూ షమీ అందుబాటులో ఉంటాడో లేదోనన్న విషయంలో సందిగ్దత ఉంది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి స్వయంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో షమీ అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో షమీ ఆడతాడా లేదా అన్నది.. అతడి ఐపీఎల్‌ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. 

గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అతడు గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి రానున్న ఎడిషన్‌లో షమీ ఎలా ఆడతాడో చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

‘‘మ్యాచ్‌ సమయంలో అతడికి గాయం కాలేదు. అయితే, మడిమ నొప్పి రాను రాను తీవ్రమైంది. ముంబైలో షమీ పలువురు డాక్టర్లను సంప్రదించాడు. తదుపరి జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతడు పునరావాసం పొందనున్నాడు’’ సదరు వర్గాలు తెలిపినట్లు సమాచారం.

ఇక బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గాయమైతే అంత తీవ్రంగా లేదు. తన తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న మ్యాచ్‌ను చూడటానికి కూడా షమీ వచ్చాడు. అపుడు కాలు కాస్త ఉబ్బినట్లు కనిపించింది’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడన్న విషయం తెలిసిందే.

చదవండి: ‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్‌కు పంపాల్సింది’

మరిన్ని వార్తలు