NZ Vs SL: వారెవ్వా షిప్లే.. దెబ్బకు వికెట్‌ ఎగిరి అంతదూరాన పడింది! షాక్‌లో నిసాంక! వీడియో వైరల్‌

25 Mar, 2023 12:41 IST|Sakshi
షిప్లే బౌలింగ్‌లో నిసాంక బౌల్డ్‌ (PC: Blackcaps)

New Zealand vs Sri Lanka, 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో న్యూజిలాండ్‌ బౌలర్‌ హెన్రీ షిప్లే విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దసున్‌ షనక బృందం షిప్లే దెబ్బకు అల్లాడిపోయింది.

దెబ్బకు బౌల్డ్‌
పేసర్‌ మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో లంక ఓపెనర్‌ నవనీడు ఫెర్నాండో రనౌట్‌(2.1 ఓవర్లో) అయ్యాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌, టామ్‌ లాథమ్‌ తొలి వికెట్‌లో భాగస్వామ్యం అయ్యారు. ఇక ఆ తర్వాత కివీస్‌ యువ పేసర్‌ షిప్లే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 3.3 ఓవరల్లో మరో ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంకను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు.

గంటకు 132.5 కిలోమీటర్ల వేగంతో షిప్లే విసిరిన బంతికి దెబ్బకు వికెట్‌ ఎగిరి అంతదూరాన పడింది. షిప్లే దెబ్బకు అవాక్కైన నిసాంక బిక్కమొహం వేసి క్రీజును వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

లంకకు ఘోర పరాభవం
ఇక 10 ఓవర్లలోపే షిప్లే.. నిసాంక(0) సహా కుశాల్‌ మెండిస్‌(0), చరిత్‌ అసలంక(9), కెప్టెన్‌ దసున్‌ షనక(0), చమిక కరుణరత్నె(11) వికెట్లు కూల్చాడు. తద్వారా కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల హాల్‌ సాధించాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌ బౌలర్ల దెబ్బకు లంక 76 పరుగులకే ఆలౌట్‌ అయింది. 198 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో విజయంతో కివీస్‌ 1-0తో ముందంజలో నిలిచింది.

మరిన్ని వార్తలు