టైటిల్‌ పోరుకు విష్ణువర్ధన్‌–కృష్ణప్రసాద్‌ జంట

28 Mar, 2021 05:44 IST|Sakshi

పారిస్‌: తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్‌ గౌడ్‌–కృష్ణప్రసాద్‌ ద్వయం 21–17, 21–17తో కాలమ్‌ హెమ్మింగ్‌–స్టీవెన్‌ స్టాల్‌వుడ్‌ (ఇంగ్లండ్‌) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బెన్‌ లేన్‌–సీన్‌ క్యాండీ (ఇంగ్లండ్‌) జంటతో విష్ణువర్ధన్‌–కృష్ణప్రసాద్‌ ద్వయం ఆడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సైనా 17–21, 17–21తో లైన్‌ క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జోడీ 18–21, 9–21తో టాప్‌ సీడ్‌ జాంగ్‌కోల్ఫాన్‌–రవింద ప్రజోగ్‌జాయ్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో అశ్విని పొన్నప్ప–ధ్రువ్‌ కపిల (భారత్‌) ద్వయం 9–21, 23–21, 7–21తో నోర్‌ నిక్లాస్‌–అమేలియా (డెన్మార్క్‌) జోడి చేతిలో పరాజయం పాలైంది.

మరిన్ని వార్తలు