Azerbaijan Grand Prix: వెర్‌స్టాపెన్‌కు కలిసిరాని అదృష్టం

7 Jun, 2021 02:58 IST|Sakshi
కారు టైరు పంక్చర్‌ కావడంతో వెర్‌స్టాపెన్‌ అసహనం

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్‌ జట్టుకు మిశ్రమ ఫలితాలు

ఆధిక్యంలో ఉన్నదశలో డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ టైరు పంక్చర్‌

కారు గోడకు ఢీకొట్టుకోవడంతో రేసు నుంచి అవుట్‌

సహచరుడు పెరెజ్‌ ఖాతాలో టైటిల్‌

బాకు (అజర్‌బైజాన్‌): ఈ సీజన్‌లో మూడో విజయం ఖాయమనుకుంటున్న దశలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసి రాలేదు. అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాల్సిన అతను ఒక్క పాయింట్‌ కూడా సంపాదించకుండా రేసు నుంచి వైదొలగాల్సి వచ్చింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకు నగర వీధుల్లో జరిగిన 51 ల్యాప్‌ల రేసులో వెర్‌స్టాపెన్‌ 46వ ల్యాప్‌ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. సర్క్యూట్‌పై రయ్‌ రయ్‌మంటూ దూసుకుపోతున్న దశలో వెర్‌స్టాపెన్‌ కారు ఎడమ టైరు పంక్చర్‌ అయింది. దాంతో నియంత్రణ కోల్పోయిన వెర్‌స్టాపెన్‌ కారు కాంక్రీట్‌ గోడకు బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా వెర్‌స్టాపెన్‌ కారు నుంచి బయటకు వచ్చి రేసు నుంచి వైదొలిగాడు.

వెర్‌స్టాపెన్‌ ఘటన తర్వాత రేసును అరగంటపాటు ఆపారు .ఆ తర్వాత సేఫ్టీ కార్ల నడుమ రేసును మళ్లీ కొనసాగించగా... రెడ్‌బుల్‌ జట్టుకే చెందిన సెర్గియో పెరెజ్‌ విజేతగా అవతరించాడు. దాంతో వెర్‌స్టాపెన్‌ ఘటనతో నిరాశలో ఉన్న రెడ్‌బుల్‌ బృందంలో ఆనందం వెల్లివెరిసింది. ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పెరెజ్‌ అందరికంటే ముందుగా 2 గంటల 13 నిమిషాల 36.410 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో పెరెజ్‌కిది తొలి విజయం కాగా కెరీర్‌లో రెండోది.

ప్రపంచ మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ (ఆస్టన్‌ మార్టిన్‌) రెండో స్థానంలో... పియరీ గ్యాస్లీ (ఆల్ఫా టారీ) మూడో స్థానంలో నిలిచారు. పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ను ఆరంభించిన ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) 15వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రాన్స్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక డ్రైవర్స్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ పాయింట్ల పట్టికలో వెర్‌స్టాపెన్‌ (105 పాయింట్లు), హామిల్టన్‌ (101 పాయింట్లు), పెరెజ్‌ (69 పాయింట్లు), లాండో నోరిస్‌ (66 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు