వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం.. శంకుస్ధాపన చేయనున్న మోదీ

23 Sep, 2023 11:20 IST|Sakshi

పవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసిలో సరికొత్త క్రికెట్‌ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(సెప్టెంబర్‌ 23) శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వారణాసికి మోదీ చేరుకోనున్నారు.

ఈ భూమి పూజ కార్యక్రమానికి మోదీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్ హాజరుకానున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జైషా సహా కీలక వ్యక్తులు కూడా పాల్గొనున్నారు.

ఈ స్టేడియాన్ని  సుమారు రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో  ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భూసేకరణ కోసం రూ. 121 కోట్లు వెచ్చించగా.. స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ రూ. 330 కోట్లు ఖర్చు చేయనుంది.

ఈ వారణాసి స్టేడియంలో  అడుగడుగునా శివతత్వం ప్రతిబింబించేలా రూపుదిద్దనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీటింగ్ మొత్తాన్ని అర్థం చంద్రాకారంలో నిర్మించనున్నారు. అదే విధంగా స్టేడియం ఫ్లెడ్‌ లైట్లు  త్రిశూలం ఆకారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టేడియం ఎంట్రీని ఢమరుకం ఆకారంలో  తయారు చేయనున్నారు.

అంతేకాకుండా  మొత్తం 31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేబోయే ఈ స్టేడియంలో.. ఏడు పిచ్‌లను సిద్దం చేయనున్నారు. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చోని వీక్షించేలా ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ స్టేడియం పూర్తి కానుంది. ఇక ఈ స్టేడియం నమూనాకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: #Suryakumar Yadav: "సూర్య" గ్రహణం వీడింది.. 590 రోజుల తర్వాత తొలి హాఫ్‌ సెంచరీ

మరిన్ని వార్తలు