WTC Finals 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు పుజారా వార్నింగ్‌.. దబిడిదిబిడే అంటున్న నయా వాల్‌

30 Apr, 2023 09:25 IST|Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు ముందు భారత టెస్ట్‌ జట్టు సభ్యుడు, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్‌ మెసేజ్‌ పంపాడు. ఇంగ్లండ్‌ కౌంటీల్లో ససెక్స్‌ జట్టుకు సారధ్యం వహిస్తున్న పుజారా.. మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు బాది ఆసీస్‌ బౌలర్లు తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులు ఎదుర్కొని 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు.

అంతకుముందు డర్హమ్‌తో జరిగిన సీజన్‌ తొలి మ్యాచ్‌లోనూ (115) పుజారా సెంచరీతో కదంతొక్కాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ 2, 2023లో ప్రస్తుతం పుజారా లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా (5 ఇన్నింగ్స్‌ల్లో 332) కొనసాగుతున్నాడు. తాజా శతకంతో పుజారా ఓ మైలురాయిని అధిగమించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి (58 సెంచరీలు) ఎగబాకాడు.

ఈ క్రమంలో అతను వసీం జాఫర్‌ (57)ను ఓవర్‌టేక్‌ చేశాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌, సునీల్‌ గవాస్కర్‌ చెరి 81 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆతర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ 68 సెంచరీలతో రెండో ప్లేస్‌లో.. విజయ్‌ హజారే మూడో స్థానంలో నిలిచారు.  

కాగా, లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 7 నుంచి ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పుజారా కీలక సభ్యుడు. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు (24 మ్యాచ్‌ల్లో 50.82 సగటున 203 పరుగులు) కలిగిన పుజారా.. ఇదివరకే తాను చాలాసార్లు సత్తా చాటిన ఓవల్‌ మైదానంలో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.   ‌ 

ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌- 455/5 డిక్లేర్‌
గ్లోసెస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌-198/9 (మూడో రోజు ఆట ముగిసే సమయానికి)

మరిన్ని వార్తలు