టీమిండియా క్రికెటర్ల పెద్ద మనసు.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం

21 May, 2021 16:25 IST|Sakshi
టీమిండియా క్రికెటర్లు.. ఇన్‌సెట్‌లో స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ రుచిర్‌ మిశ్రా

ముంబై: కరోనా మహమ్మారితో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కరోనా బారీన పడుతుండగా.. మరికొంతమంది ప్రాణాలు వదులతున్నారు. ఆ కోవకు చెందినవారే సీనియర్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ రుచిర్‌ మిశ్రా. మిశ్రా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో  పదేళ్లుగా  స్పోర్ట్స్‌ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఆయన టీమిండియా స్వదేశంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌తో పాటు డొమస్టిక్‌ లీగ్‌లను కవర్‌ చేసేవాడు. మంచి స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా పేరు సంపాదించిన మిశ్రాకు పలువురు టీమిండియా క్రికెటర్లు పరిచయమయ్యారు.

ఇలా ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో కరోనా పెను విషాదం నింపింది. కొన్ని రోజుల కిందట రుచిర్‌ మిశ్రా కరోనా బారీన పడి మే4న నాగ్‌పూర్‌లో కన్నుమూశారు. దీంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రుచిర్‌ మిశ్రా ఒక ఫండ్‌ రైజర్‌ను స్థాపించి ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, చతేశ్వర్‌ పుజారా, టీమిండియా వుమెన్స్‌ కోచ్‌ రమేశ్‌ పొవార్‌లు స్పందించారు. ఉమేశ్‌ రూ. లక్ష విరాళం ఇవ్వగా.. అశ్విన్‌, పుజారా, పొవార్‌లు రూ. 50 వేలు విరాళంగా ఇచ్చి పెద్ద మనుసు చాటుకున్నారు. మీ ఇంటి పెద్దని మేం తీసుకురాలేకపోవచ్చు.. కానీ మేమిచ్చే ఈ డబ్బు మీ ఆర్థిక పరిస్థితి బాగుండేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.. అంటూ క్రికెటర్లు పేర్కొన్నారు. కాగా మిశ్రా కుటుంబానికి క్రికెటర్లు చేసిన సాయం తెలుసుకొని వసీం జాఫర్‌ సహా మరికొందరు సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 

ఇక కరోనా సెగతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. కివీస్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు సమాయత్తమవుతున్న టీమిండియా జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. జూన్‌ 18 నుంచి 22 వరకు టీమిండియా కివీస్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.
చదవండి: క్రికెటర్‌ భువనేశ్వర్‌ ఇంట్లో విషాదం

మరిన్ని వార్తలు