Ravi Bishnoi: టీమిండియా స్పిన్‌ సంచలనం.. ఏడాది కాలంలోనే వరల్డ్‌ నంబర్‌ వన్‌గా!

6 Dec, 2023 17:33 IST|Sakshi

ICC T20I Rankings: Ravi Bishnoi Top Spot in Bowling Charts: రవి బిష్ణోయి.. టీమిండియా యువ స్పిన్‌ సంచలనం.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే పొట్టి ఫార్మాట్లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఎదిగాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సంపాదించాడు.

రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో 2000వ సంవత్సరంలో సెప్టెంబరు 5న జన్మించాడు రవి. క్రికెటర్‌ కావాలన్న కలతో చిన్ననాటి నుంచే కఠోర శ్రమకోర్చిన అతడు.. లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్‌లో తొలుత రాజస్తాన్‌కు ఆడిన రవి బిష్ణోయి.. ఇటీవలే గుజరాత్‌ జట్టుకు మారాడు.

ఇక ఎంతో మంది యువ క్రికెటర్ల మాదిరిగానే రవి బిష్ణోయి కూడా అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ద్వారా తొలుత వెలుగులోకి వచ్చాడు. సౌతాఫ్రికాలో 2020లో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో మొత్తంగా 17 వికెట్లతో సత్తా చాటి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2020 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ద్వారా అరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక వికెట్‌ సాధించాడు.

ఆ తర్వాత 2022లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మారిన రవి బిష్ణోయి.. ఆ సీజన్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయి.. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవి.. సౌతాఫ్రికాతో సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 21 టీ20లు ఆడిన రవి బిష్ణోయి.. 34 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 4/16. ఇక ఆడిన ఏకైక వన్డేలోనూ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు 23 ఏళ్ల రవి. 

ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సందర్భంగా.. రవి బిష్ణోయి మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా ఐసీసీ టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానం ఆక్రమించాడు.

ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 4-1తో గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలవడంతో పాటు.. ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గానూ అవతరించాడు రవి. నిలకడైనా ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే టాప్‌ బౌలర్‌గా నిలిచాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో తన స్థానం దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. తద్వారా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ప్రపంచకప్‌ ఆశలకు పరోక్షంగా గండికొట్టాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌ల రూపంలో గట్టి పోటీ ఎదుర్కొని..  ఈ స్థాయికి చేరుకున్నాడు.

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌- టాప్‌-5 బౌలర్లు వీరే
►రవి బిష్ణోయి(ఇండియా)- 699 రేటింగ్‌ పాయింట్లు
►రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌)- 692 రేటింగ్‌ పాయింట్లు
►వనిందు హసరంగ(శ్రీలంక)- 679 రేటింగ్‌ పాయింట్లు
►ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌)- 679 రేటింగ్‌ పాయింట్లు
►మహీశ్‌ తీక్షణ(శ్రీలంక)- 677 రేటింగ్‌ పాయింట్లు.

చదవండి: నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్‌

>
మరిన్ని వార్తలు