ఆసియా పారా క్రీడల్లో ‘రవి’ ప్రభంజనం 

26 Oct, 2023 04:07 IST|Sakshi

షాట్‌పుట్‌లో సిల్వర్‌ మెడల్‌  

ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ప్రధాని మోదీ అభినందనలు 

కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన తెలుగోడు చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందాడు.  అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు మండలం వారాడ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి రవి ఆసియా పారా క్రీడల షాట్‌పుట్‌ విభాగంలో రజత పతకం సాధించాడు.

చైనాలోని హాంగ్జౌలో ఆసియా పారా క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన పోటీల్లో ఎఫ్‌–40 షాట్‌పుట్‌ విభాగంలో పాల్గొన్న రవి 9.92 మీటర్ల దూరం విసిరి సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నాడు. ఈ పోటీల కోసం ఏడాదిన్నరగా బెంగళూరులోని సాయి అకాడమీలో శిక్షణ పొందినట్టు రవి ‘సాక్షి’కి తెలిపాడు. పతకం  సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ పోటీలో ఇరాక్‌ దేశానికి చెందిన క్రీడాకారునికి గోల్డ్‌ మెడల్‌ దక్కిందని తెలిపాడు. 

స్వగ్రామంలో ఆనందం  
దేశం మెచ్చేలా రవి సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో సొంత గ్రామం చిరికివానిపాలెంలో సందడి చోటుచేసుకుంది. అందరిలా ఎత్తుగా లేనన్న భావన మనసులోకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి డ్వార్‌్ఫ(దివ్యాంగుల క్రీడలు) క్రీడల్లో ఉత్తమ ప్రతిభను చాటేందుకు నిరంతరం శ్రమించేవాడని గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు రొంగలి దేముడుబాబు, మంగ వ్యవసాయం చేసుకుంటూనే కుమారుడు క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహించారు. రవి చైనా నుంచి ఈనెల 28న  దేశానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ప్రధాని అభినందన   
రవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌(ట్విట్టర్‌) ద్వారా అభినందించారు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా రవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు