Ind Vs Eng 1st Test: చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలిటెస్టుపై ఫిక్సింగ్‌ అనుమానాలు?

7 Mar, 2022 08:34 IST|Sakshi

గతేడాది ఇంగ్లండ్‌ జట్టు ఫిబ్రవరిలో టీమిండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఇంగ్లండ్‌ టీమిండియాతో నాలుగు టెస్టులు, ఐదు టి20, మూడు వన్డేలు ఆడింది. కాగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అనూహ్యంగా టీమిండియా తొలి టెస్టులో ఓడిపోయింది. ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్‌ ఆడుతుందంటే పిచ్‌ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. కానీ తొలి టెస్టు మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.

తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో 227 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది.  డొమినిక్ సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ 178 పరుగులకే ఆలౌట్ కావడంతో .. భారత్‌ ముందు 433 పరుగుల టార్గెట్‌ ఉంది. కానీ టీమిండియా తమ వికెట్లు కాపాడుకోలేక 192 పరుగులకి ఆలౌట్ అయి మ్యాచ్‌ ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్‌పై.. పిచ్‌ తయారు చేసిన క్యురేటర్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ఫలితం తర్వాత చెపాక్ స్టేడియం పిచ్ క్యూరేటర్‌ని ఆ పదవి నుంచి తొలగించిన బీసీసీఐ కొత్త క్యూరేటర్‌ని నియమించిన సంగతి తెలిసిందే.

తాజాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఫిక్సింగ్‌ ఏమైనా జరిగిందా అని సమాచారం. ముఖ్యంగా పిచ్‌ క్యూరేటర్‌ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వాస్తవానికి తొలి టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్‌మెంట్, పిచ్ క్యూరేటర్‌ని కలిసి పిచ్ ఎలా తయారుచేయాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు...మ్యాచ్‌కి ముందు రోజు సాయంత్రం అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి చెపాక్‌లోని చిదంబరం స్టేడియానికి వెళ్లారు...క్యూరేటర్‌కి, గ్రౌండ్‌మెన్‌కి పిచ్ ఎలా తయారుచేయాలో సూచించారు. 


పిచ్‌ ఎలా ఉందో అలా వదిలేయాలని నీళ్లు కొట్టడం కానీ, రోలర్ వాడడం కానీ చేయకూడదని తెలిపారు...అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు పిచ్‌కి నీళ్లు కొట్టిన క్యూరేటర్, రోలర్ కూడా వాడారు. దీంతో పిచ్‌ బ్యాటింగ్‌కి అనుకూలంగా మారి, మొదటి రెండు రోజులు బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు...బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్యూరేటర్... పిచ్‌పై నీళ్లు కొట్టి, రోలర్ ఎందుకు వాడాడు? కావాలని టీమిండియాకి విరుద్ధంగా రిజల్ట్ రావాలని ఈ విధంగా చేశాడా?లేక మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా? అనేది తేల్చేందుకు బీసీసీఐ విచారణ జరపాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. 

కాగా మళ్లీ చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం టీమిండియా విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీయగా, టెస్టు ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మూడు, నాలుగు టెస్టులు వరుసగా గెలిచిన టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

చదవండి: Shane Warne- Ricky Ponting: వార్న్‌ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్‌

WTC Points Table: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్‌ సేన.. ఎన్నో స్థానంలో ఉందంటే

>
మరిన్ని వార్తలు