Rohit Sharma: విభేదాలంటూ వార్తలు.. కోహ్లి కెప్టెన్సీపై రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

13 Dec, 2021 15:20 IST|Sakshi

Rohit Sharma Comments On Virat Kohli Captaincy: టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథి రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి సారథ్యంలో ఆడటం తనకు గొప్ప అనుభూతులను మిగిల్చిందన్నాడు. కాగా టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లిని కాదని బీసీసీఐ రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసంతృప్తికి లోనైన కోహ్లి.. వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లి, రోహిత్‌ మధ్య అభిప్రాయ భేదాలు ముదిరాయంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ కోహ్లి కెప్టెన్సీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐకి ఇచ్చి ఇంటర్వ్యూలో హిట్‌మ్యాన్‌ మాట్లాడుతూ.. కోహ్లి సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ మేరకు.. ‘‘కోహ్లి కెప్టెన్సీలో మేము చాలా గొప్ప మ్యాచ్‌లు ఆడాము. ఆటను పూర్తిగా ఆస్వాదించాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేశాము. ఇక ముందు కూడా అదే కొనసాగుతుంది. నిజానికి తను జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపాడు. ఐదేళ్ల కాలంలో అలుపెరుగని కృషి చేశాడు. ఇప్పుడు.. కూడా అదే స్ఫూర్తితో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలన్నదే నా అభిమతం’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

మరోవైపు 2013 తర్వాత భారత్‌ మరో ఐసీసీ టోర్నీ గెలవలేకపోయిన లోటును త్వరలోనే తీర్చేందుకు ప్రయత్నిస్తామని రోహిత్‌ అన్నాడు. ఐసీసీ టోర్నీ నెగ్గే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నాయని, పలు అంశాలు చక్కబెట్టుకోవాల్సి ఉందని, వీటిని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో విజేతగా నిలుస్తామని రోహిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

చదవండి: Virat kohli: ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ.. కోహ్లికి నో ఛాన్స్‌!

మరిన్ని వార్తలు