Rohit Sharma: 'బౌలింగ్‌ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్‌ 23నే'

3 Oct, 2022 08:54 IST|Sakshi

గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల జడివానలో మొదట టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లిలో మెరుపులు మెరిపించగా.. ఆ తర్వాత లక్ష్య చేధనలో డేవిడ్‌ మిల్లర్‌ విధ్వంసం.. డికాక్‌ విధ్వంసంతో స్టేడియం హోరెత్తిపోయింది. టీమిండియా భారీ స్కోరు చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే ప్రొటిస్‌ మ్యాచ్‌ గెలిచి ఉండేది. ఈ విజయంతో మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా స్వదేశంలో టీమిండియాకు సౌతాఫ్రికాపై తొలి టి20 సిరీస్‌ను గెలిచినట్లయింది. 

ఇక మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ''బ్యాటింగ్‌ విషయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నా. గత 8-10 నెలల నుంచి మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒకే విధంగా సాగుతుంది. ఇక బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బ్యాటర్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే బ్యాటింగ్‌లో అంతా పాజిటివ్‌గానే ఉంది. ఓపెనర్లుగా నేను, కేఎల్‌ రాహుల్‌, వన్‌డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ వరకు ఎలాంటి మార్పులు ఉండవు. రానున్న టి20 ప్రపంచకప్‌లో టాప్‌-4 బాగా రాణిస్తుందని అనుకుంటున్నా.

ఇక ఐదో స్థానం నుంచి ఏడో స్థానం వరకు పరిస్థితులను బట్టి బ్యాటర్లు మారుతుంటారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో మా ప్రదర్శన బాగుంది. ఈరోజు పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌ చేశామనిపించింది. అయితే గత ఐదారు మ్యాచ్‌లుగా చూసుకుంటే డెత్‌ ఓవర్లలో మా బౌలింగ్‌ దారుణంగా ఉంటుంది. దానిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇవాళ్టి మ్యాచ్‌లో మా బౌలింగ్‌ బాగాలేదు. ఆరంభంలో దీపక్‌ చహర్‌, అర్షదీప్‌లు మంచి ఆరంభం ఇచ్చినప్పటికి మధ్య, డెత్‌ ఓవర్లలో దానిని కాపాడుకోలేకపోయాం.

ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో మాకు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం కష్టమవుతోంది. దీనిని అధిగమించాల్సి ఉంది. ఇక సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను నేరుగా అక్టోబర్‌ 23న ఆడించాలనుకుంటున్నాం. సూర్య తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక అతన్ని కాపాడుకోవడం మా బాధ్యత. అందుకే అతడికి రెస్ట్‌ ఇవ్వడం కరెక్టని నా అభిప్రాయం. ఇక సూర్య క్రీజులో కనిపించేది అక్టోబర్‌ 23నే. ఇక మూడో టి20కి జట్టులో మార్పులుంటాయి'' అంటూ ముగించాడు. 

ఇక టీమిండియా సౌతాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్‌ అక్టోబర్‌ 4న ఆడనుంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత టీమిండియా జట్టు టి20 ప్రపంచకప్‌ కోసం అక్టోబర్‌ 6న ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనుంది. టి20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. ఇక శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో టీమిండియా .. దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

చదవండి: కోహ్లి కెరీర్‌లో తొలిసారి.. జీవితకాలం గుర్తుండిపోవడం ఖాయం!

మరిన్ని వార్తలు