ఒలింపిక్స్‌ కోసమే సన్నాహాలు

6 May, 2021 03:55 IST|Sakshi

విశ్వ క్రీడలు జరుగుతాయనే ఆశిస్తున్నా

ఆంక్షలతో ఆట కష్టంగా మారింది

‘సాక్షి’తో పీవీ సింధు

భారత్‌లో క్రీడలు ఆగిపోయాయి. విదేశాలకు వెళ్లి టోర్నీలు ఆడాలంటే సవాలక్ష ఆంక్షలు. ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్‌ కూడా జరుగుతుందా అనేది కూడా సందేహమే. ఇలాంటి స్థితిలో ఆటగాళ్లు నిరంతర సాధనను కొనసాగించడం అంత సులువు కాదు. దేని కోసం సన్నద్ధమవుతున్నామో తెలియని స్థితిలో ప్రేరణ పొందడం కష్టంగా ఉంటుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు కూడా ఒకదశలో దాదాపు ఇదే స్థితిలో ఉంది. అయితే అన్నీ అనుకూలించి ఒలింపిక్స్‌ జరుగుతాయని తాను ఆశిస్తున్నానని... మధ్యలో ఇతర టోర్నీల్లో ఆడినా, ఆడకపోయినా ఇబ్బంది లేదంటున్న సింధు పలు అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే...   

రోజూవారీ ప్రాక్టీస్‌పై...
ఎప్పటిలాగే నా రొటీన్‌లో మార్పులు లేకుండా ఉదయం, సాయంత్రం సాధన కొనసాగిస్తున్నాను. సుదీర్ఘ సమయంపాటు ప్రాక్టీస్‌ జరుగుతోంది. వారంలో రెండు రోజులు ట్రెయినింగ్‌కు కేటాయించి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను. అదృష్టవశాత్తూ గత కొంత కాలంగా ఫిట్‌నెస్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలూ లేవు. వంద శాతం బాగుండటంతో ప్రాక్టీస్‌ సెషన్లు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి.  

కోచ్‌ పార్క్‌ పర్యవేక్షణపై...
గత కొన్ని నెలలుగా నేను గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలోనే సాధన చేస్తున్నాను. భారత సింగిల్స్‌ కోచ్‌ పార్క్‌ పూర్తి సమయం కేటాయిస్తూ నా ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని టోర్నీల్లో నేను మెరుగైన స్థితిలో ఉండి కూడా మ్యాచ్‌లు చేజార్చుకున్నాను. ఆ సమయంలో చేసిన తప్పులు, లోపాలను సరిదిద్దుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇన్నేళ్ల అనుభవం తర్వాత కొత్తగా నేర్చుకునే అంశాలు ఉండవు కానీ సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదనేది నా అభిప్రాయం. అందుకే కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆటపైనే పూర్తి ఫోకస్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.  

రాబోయే టోర్నీలపై...
ప్రస్తుతం మా అందరిదీ ఇదే పెద్ద సమస్య. మే 25 నుంచి మలేసియా ఓపెన్‌లో ఆడాల్సి ఉంది. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి అంటే ఈ నెల 10కే అక్కడ ఉండాలి. దీనిపైనే స్పష్టత రావడం లేదు. ఒకటి రెండు రోజుల్లో పాల్గొనేది లేనిదీ తెలిసిపోతుంది. ఆ తర్వాత సింగపూర్‌ ఓపెన్‌ ఉంది. అక్కడైతే 21 రోజుల క్వారంటైన్‌... అదీ మరీ కష్టం. అసలు 5–6 రోజులు సాధన చేయకుండా హోటల్‌ గదిలో ఉండిపోతే శరీరం బిగుసుకుపోతుంది. చురుకుదనం తగ్గిపోతుంది. 14 రోజుల తర్వాత ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండా కోర్టులోకి వెళ్లి ఆడాలంటే చాలా కష్టం. ఈ సమస్యలన్నీ ఉండటంతో టోర్నీకి వెళ్లాలా లేదా అనేదానిపై సందేహాలున్నాయి. నేను ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాను కాబట్టి ఆ కోణంలో సమస్య లేదు కానీ ఎంత కాలం మ్యాచ్‌లు లేకుండా ఉండగలం.  

టోక్యో ఒలింపిక్స్‌ సన్నద్ధతపై...
ఇప్పుడు నేను ఇంతగా కష్టపడుతోంది సరిగ్గా చెప్పాలంటే ఒలింపిక్స్‌ గురించే. ఇతర టోర్నీల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా పెద్ద సమస్య లేదు. జపాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయోగానీ ఒలింపిక్స్‌ జరగాలని కోరుకుంటున్నా. జరుగుతాయని కూడా ఆశిస్తున్నా. నిజాయితీగా మాట్లాడితే ఒలింపిక్స్‌ ఉన్నాయనే నమ్మకంతోనే సాధన చేస్తున్నా. అదే నాకు ప్రేరణనిస్తుంది. ఎప్పుడు జరిగినా ఆడేందుకు మనం సిద్ధంగా ఉండాలి. సన్నాహాల్లో లోటు ఉండకూడదు. విశ్వ క్రీడలు జరిగితే మనకు మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంతో జరగకపోయినా ఏమీ చేయలేం. సాధన చేయడంతో వచ్చిన నష్టమేమీ లేదు. మన పనే అది కదా.

యూరప్‌లో శిబిరం ఏర్పాటు చేస్తే...
అది ఇప్పుడు అంత సులువు కాదు. భారత్‌ నుంచి వచ్చేవారిపై యూరప్‌లోని దాదాపు ప్రతీ దేశంలో ఆంక్షలు ఉన్నాయి. విమానాలు లేవు, ఎక్కడికి వెళ్లినా క్వారంటైన్‌లు, పరీక్షలు. ఆసియా దేశాల్లోనే మన పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఇక యూరప్‌లో చెప్పేదేముంది. నేను గత ఏడాది ఇంగ్లండ్‌కు వెళ్లి సాధన చేసినప్పుడు పరిస్థితులు మన దేశంలో ఇంత తీవ్రంగా లేవు. కాబట్టి ఉన్న చోటనే సరైన ప్రణాళికతో ప్రాక్టీస్‌ సాగించడం మేలు. ఒకరిద్దరి వ్యక్తిగత అభిప్రాయం వేరు. మొత్తం భారత జట్టు కోణంలో దీనిని చూడాలి.  

మళ్లీ 11 పాయింట్ల స్కోరింగ్‌పై...
గతంలోనూ ఈ స్కోరింగ్‌ విధానం ఉంది. మళ్లీ అమలు చేస్తే పెద్ద తేడా ఏమీ రాదు. అయితే ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించేలా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కోలుకునేందుకు అవకాశం తక్కువ. మ్యాచ్‌లు వేగంగా సాగిపోతాయి. అమల్లోకి తెస్తే ఆడక తప్పదు కానీ నా దృష్టిలో మాత్రం 21 పాయింట్ల స్కోరింగే మంచిది.

బ్యాడ్మింటన్‌ బయట బాధ్యతలపై...
ప్రస్తుతం చాలా మందిలాగే నేను కూడా ప్రాక్టీస్‌ చేసేటప్పుడు మినహా మిగిలిన సమయం మొత్తం ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడుపుతున్నాను. ఇంట్లోనే పెంపుడు కుక్కలతో సమయం సరదాగా గడిచిపోతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నాకు హైదరాబాద్‌లోనే లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పని చేసే అవకాశం కల్పించింది. సాధ్యమైనన్ని సార్లు ఆఫీస్‌కు వెళ్లి నా విధులు, బాధ్యతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.

 –సాక్షి, హైదరాబాద్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు