విజేత రైల్వేస్‌

5 May, 2022 05:45 IST|Sakshi

పదోసారి జాతీయ సీనియర్‌ మహిళల టి20 క్రికెట్‌ టోర్నీ టైటిల్‌ సొంతం

ఫైనల్లో మహారాష్ట్రపై విజయం

రాణించిన మేఘన, హేమలత

సూరత్‌: దేశవాళీ మహిళల జాతీయ సీనియర్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. భారత స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో స్నేహ్‌ రాణా కెప్టెన్సీలోని ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్‌ జట్టు ఈ టైటిల్‌ను సాధించడం ఇది పదోసారి కావడం విశేషం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది.

ఓపెనర్‌ స్మృతి మంధాన 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. రైల్వేస్‌ బౌలర్‌ స్వాగతిక 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం రైల్వేస్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది. రైల్వేస్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘన మరోసారి అదరగొట్టింది. ఓపెనర్‌ మేఘన 32 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు... మరో బ్యాటర్‌ హేమలత 41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 పరుగులు సాధించి రైల్వేస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. రైల్వేస్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అంజలి శర్వాణి 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
 

మరిన్ని వార్తలు