తాలిబ‌న్ల‌ను పొగిడిన పాక్ క్రికెట‌ర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజ‌న్లు

31 Aug, 2021 16:01 IST|Sakshi

ఇస్లామాబాద్‌: "తాలిబన్లు సానుకూల దృక్పథంతో ముందుకొచ్చారు.. మహిళలను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.. తాలిబన్లు క్రికెట్‌ను చాలా ఇష్టపడతారంటూ" తాలిబన్ల అనుకూల వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. దీంతో సోషల్‌మీడియా వేదికగా అఫ్రిదిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాలిబ‌న్ల క్రూర పాలన నుంచి త‌ప్పించుకునే క్రమంలో ల‌క్ష‌ల సంఖ్యలో అఫ్గాన్లు, ముఖ్యంగా మ‌హిళ‌లు ఇల్లు వాకిలి వ‌దిలేసి పారిపోతుంటే అఫ్రిది ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఊగిపోతున్నారు. అఫ్గాన్ల అవస్థలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంటే అఫ్రిది ఈ రకమైన వ్యాఖ్యలు చేయడమేంటని విరుచుకుపడుతున్నారు. తాలిబ‌న్లు శాంతి కాముఖులమంటూనే, మహిళలను అణగదొక్కడం వారి రెండు వారాల పాలనతో  తేలిపోయిందని, ఇలాంటి వారికి పాక్‌ క్రికెటర్‌ వత్తాసు పలకడాన్ని అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.

సాధారణ అఫ్గాన్‌ మ‌హిళ‌లు, మహిళా జ‌ర్న‌లిస్టులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే అఫ్రిది లాంటి ప్ర‌ముఖుడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోందని మరికొందరంటున్నారు. "తాలిబ‌న్ల‌కు క్రికెట్ అంటే ఇష్టం. వాళ్లు స‌హ‌క‌రిస్తే దేశంలో క్రికెట్‌ బాగా అభివృద్ధి చెందుతుందని" అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లపై పాక్‌ మహిళా జ‌ర్న‌లిస్ట్ నైలా ఇనాయ‌త్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇత‌డు తాలిబ‌న్ల త‌ర్వాతి ప్ర‌ధాని కావాలి అంటూ సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
చదవండి: అక్కడ జాన్‌ సీనా అయితే ఇక్కడ సురేశ్‌ రైనా..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు