Asia Cup 2022 IND Vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో విజేత ఎవరు? అఫ్రిది నుంచి ఊహించని ట్విస్ట్‌

24 Aug, 2022 08:52 IST|Sakshi

మనం ఎంత కాదన్నా టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే హైవోల్టేజ్‌. ఈ చిరకాల ప్రత్యర్థులు ఎక్కడ తలపడ్డా ఉత్కంఠ మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే సాధారణ మ్యాచ్‌లా చూడరు.. రెండు దేశాల మధ్య యుద్ధంగానే పరిగణిస్తారు. అలాంటి మ్యాచ్‌ కోసం కోట్ల మంది జనం వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. మరి బ్లాక్‌బాస్టర్‌ మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు మాదంటే మాదే అని ఎవరికి నచ్చిన జోస్యం వాళ్లు చెప్పుకుంటూ వస్తున్నారు.

దుబాయ్‌లోని షేక్‌ జాయేద్‌ స్టేడియంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పోరు ఆదివారం(ఆగస్టు 28) జరగనుంది. గత అక్టోబర్‌లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఇదే వేదికపై పాకిస్తాన్‌.. భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి అదే వేదికలో ఈ రెండు జట్లు ఎదురుపడుతుండడంతో ఆసక్తిగా మారింది. టి20 ప్రపంచకప్‌లో తమకు ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేక పాకిస్తాన్‌కు మరోసారి దాసోహం అవుతుందా అనేది చూడాలి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని ఇద్దరిలో విజేత ఎవరనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే.. అతను ఎవరు ఊహించని సమాధానం ఇచ్చాడు. సాధారణంగా భారత్‌ అభిమాని లేదా మాజీ క్రికెటర్‌ అయ్యుంటే టీమిండియా అని.. ఒకవేళ పాక్‌ క్రికెటర్‌ లేదా అభిమాని అయితే పాకిస్తాన్‌దే గెలుపు అని పేర్కొనడం సహజం. ట్విటర్‌ వేదికగా షాహిద్‌ అఫ్రిదిని కొంతమంది అభిమానులు.. ''పాకిస్తాన్‌, భారత్‌లలో ఏ జట్టు బలంగా ఉందని అనుకుంటున్నారు.. ఎవరు మ్యాచ్‌ గెలుస్తారని అనుకుంటున్నారు?'' అని ప్రశ్నించారు. 

కచ్చితంగా బాబర్‌ ఆజం సేన ఫెవరెట్‌ అని అఫ్రిది పేర్కొంటాడని మనం అనుకుంటాం. కానీ అఫ్రిది ఈసారి మాత్రం ఊహించని సమాధానం ఇచ్చాడు. ''ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్‌ గెలుస్తారు'' అంటూ సమాధానం ఇచ్చాడు. అఫ్రిది నుంచి ఈ జవాబు వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు. ఎందుకంటే అఫ్రిది.. ఎప్పుడు టీమిండియాపై విమర్శలు కురిపిస్తూనే ఉంటాడు(క్రికెట్ పరంగా మాత్రమే).

కాగా ఆసియాకప్‌లో టీమిండియా జస్‌ప్రీత్‌ బుమ్రా రూపంలో.. అటు పాకిస్తాన్‌ షాహిన్‌ అఫ్రిది రూపంలో ఇరుజట్లు తమ కీలక బౌలర్‌ సేవలను కోల్పోయాయి. ఈ ఇద్దరు తమ జట్లకు పెద్ద బలం అని చెప్పొచ్చు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్‌ విజయంలో షాహిన్‌ అఫ్రిదిదే కీలకపాత్ర. ఇక ఆసియాకప్‌లో ఇరుజట్లు 14సార్లు తలపడగా.. భారత్‌ 8 సార్లు.. పాకిస్తాన్‌ ఐదు సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు.

చదవండి: IND vs PAK: రోజుకు 100-150 సిక్సర్లు కొడుతున్నా! మ్యాచ్‌లో కనీసం ఓ నాలుగైనా!

'రోహిత్‌, రాహుల్‌, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే'

మరిన్ని వార్తలు