ఫార్మాట్‌ మారినా గేమ్‌ మారలేదు..

21 Mar, 2021 14:15 IST|Sakshi

లక్నో: ఫార్మాట్‌ మారినా భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆటతీరు మారలేదు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 1–4తో కోల్పోయిన భారత జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మొదలైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌నూ ఓటమితోనే మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. గాయం కారణంగా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.

స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్లీన్‌ (47 బంతుల్లో 52; 6 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు), షఫాలీ వర్మ (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  షబ్నీమ్‌ మూడు... అనెకె బాష్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. అనెకె బాష్‌ (48 బంతుల్లో 66 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), సునే లూస్‌ (49 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును గెలిపించారు. రెండో టి20  నేడు ఇదే వేదికపై జరుగుతుంది. 


 

>
మరిన్ని వార్తలు