'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి'.. మాజీ సైక్లింగ్‌ కోచ్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు

16 Jun, 2022 16:38 IST|Sakshi

మాజీ జాతీయ సైక్లింగ్‌ కోచ్‌ ఆర్‌కే శర్మపై ఇటీవలే లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత టాప్‌ మహిళా సైక్లిస్ట్‌.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ విషయంలో సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఆర్‌కే శర్మపై వేటు వేసింది. దీనికి సంబంధించిన కేసును సాయ్‌ ఇటీవలే మానవ హక్కుల కమీషన్‌కు బదిలీ చేసింది. 

తాజాగా ఆర్‌కే శర్మ విషయంలో మరో టాప్‌ సైక్లిస్ట్‌.. జాతీయ చాంపియన్‌ డెబోరా హెరాల్డ్ విస్తుపోయే విషయాలు పేర్కొంది. ''ఆర్‌కే శర్మతో పాటు అతని అసిస్టెంట్‌ కోచ్‌ గౌతామని దేవి నన్ను రెండుసార్లు కొట్టారు. ప్రతీ చిన్న విషయానికి ఎగతాళి చేసేవారు. దానిని అడ్డుకోవాలని చూస్తే మరింత వేధించేవారు. అంతేకాదు మరో మహిళా సైక్లిస్ట్‌తో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా పుట్టించారు.


నిజం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు పుకార్లు పుట్టిన ఆ సైక్లిస్ట్‌ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే దీనిని కోచ్‌ ఆర్‌కే శర్మ.. అసిస్టెంట్‌ కోచ్‌ గౌతామని దేవి వేరే రకంగా ఊహించుకునేవారు. ఒక సందర్భంలో మేము ఉన్న గదిలో ఎయిర్‌ కండీషనర్‌ పని చేయకపోవడంతో కింద ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయిల గదిలోకి వెళ్లాం. అంతకముందు వాళ్ల అనుమతి తీసుకున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా కోచ్‌ ఆర్‌కే శర్మ ఆరోజు ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.'' అంటూ పేర్కొంది.

ఇక డెబోరా హెరాల్డ్ 2012 నుంచి భారత్‌ తరపున సైక్లింగ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ఆర్‌కే శర్మ నేతృత్వంలో మరింత రాటుదేలిన హెరాల్డ్.. 2014లో జరిగిన ఆసియా కప్‌ ట్రాక్‌లో 500 మీటర్ల టైమ్‌ ట్రయల్‌లో విజేతగా నిలిచింది. 2015 అక్టోబర్‌లో జరిగిన తైవాన్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ క్లాసిక్‌లో ఐదు మెడల్స్‌ సాధించిన హెరాల్డ్‌..  ఆ తర్వాత ట్రాక్‌ ఇండియా కప్‌లో మూడు మెడల్స్‌ సొంతం చేసుకుంది. ఇక యూసీఐ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సంపాదించిన హెరాల్డ్‌.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా సైక్లిస్ట్‌గా చరిత్ర సృష్టించింది.

చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్‌ ఆరోపణలు

మరిన్ని వార్తలు