పేదరికం.. ఎన్నో అవమానాలు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ హాకీ ప్లేయర్‌

5 Nov, 2023 10:01 IST|Sakshi

భారత దేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రతి విషయంలో వారిపై అంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. వారు మనసు నచ్చిన ఏ పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు మద్దతు ఉన్నా, సమాజం ప్రతి విషయంలో వారిని కుళ్ళబొడుస్తూనే ఉంది. 

ఇలాంటి అనుభవాలనే భారత దేశం​ గర్వించదగ్గ మహిళా హాకీ ప్లేయర్‌ వందనా కటారియా కూడా ఎదుర్కొంది. తనకు ఎంతో ఇష్టమైన క్రీడను (హాకీ) ఆడే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అబ్బాయిలు ఆడే ఆటలు అమ్మాయిలకు ఎందుకని చుట్టుపక్కల వాళ్లు చులకన చేశారు. అబ్బాయిల్లా పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకోవడమేంటని అవహేళన చేశారు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులను కూడా నిందించారు. ఓ దశలో అమ్మాయిగా ఎందుకు పుట్టానా అని ఆమె బాధపడింది.  

అసలే పేదరికంతో బాధపడుతుంటే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటీ మాటలతో మరింత వేధించారు. ఇలాంటి సమయంలోనే ఆమె గట్టిగా ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాలని డిసైడైంది. ఆ క్రమంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం యావత్‌ భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్యే 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన వందన కటారియా.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.  

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించిన వందన.. భారత మహిళా హాకీ జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా కొనసాగుతుంది. భారత్‌ తరఫున జూనియర్‌ వరల్డ్‌కప్‌ స్థాయి నుంచి ఒలింపిక్స్‌ వరకు ప్రాతినిథం​ వహించిన ఆమె.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ సాధించడం ద్వారా తొలిసారి దేశవ్యాప్త గుర్తింపు దక్కించుకుంది. అయితే అదే ఒలింపిక్స్‌ వందనతో పాటు ఆమె కుటుంబానికి కూడా చేదు అనుభవాలను మిగిల్చింది. 

టోక్యో ఒలింపిక్స్‌ సెమీఫైనల్స్‌లో భారత్‌.. అర్జెంటీనా చేతిలో ఓడిపోవడంతో వందన, ఆమె కుటుంబం కులపరమైన దూషణలను ఎదుర్కొంది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న జట్టులో వందన లాంటి చాలా మంది దళితులు ఉన్నందున సెమీస్‌లో భారత్‌ ఓడిందని కొందరు అగ్రవర్ణ పురుషులు ఆమె కుటుంబాన్ని దుర్భాషలాడారు. ఇలాంటి అవమానాలను తన 14 ఏళ్ల కెరీర్‌లో అనునిత్యం ఎదుర్కొన్న వందన.. మహిళల హాకీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, విమర్శకుల నోళ్లు మూయించింది. 

31 సంవత్సరాల వందన.. తన అక్కను చూసి హాకీ పట్ల ఆకర్శితురాలైంది. కనీసం బూట్లు కూడా కొనలేని స్థితి నుంచి నేడు దేశం గర్వించదగ్గ స్టార్‌గా ఎదిగింది. హాకీ స్టిక్‌ కొనే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆమె చెట్ల కొమ్మలతో సాధన చేసి ఈ స్థాయికి చేరింది. ఓ పక్క పేదరికంతో బాధపడుతూ.. మరోపక్క అవమానాలను దిగమింగుతూ  సాగిన వందన ప్రస్తానం భారత దేశ మధ్యతరగతి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు