టెస్ట్ క్రికెట్‌లో ఏదో మాయ ఉంది.. కోహ్లీ, ఆండర్సన్‌ల మధ్య పోరు అద్భుతం: మంత్రి కేటీఆర్

13 Aug, 2021 13:27 IST|Sakshi

లార్డ్స్: భారత్‌, ఇంగ్లండ్ జట్ల మ‌ధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. క్రికెట్‌పై అమితాసక్తి కనబర్చే మంత్రి.. సంప్రదాయ టెస్ట్‌ ఫార్మాట్‌పై పలు కామెంట్లు చేశారు. టెస్ట్ క్రికెట్‌లో ఏదో మాయ ఉందని, ఈ ఫార్మాట్‌లో ఉన్న మజానే వేరని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అందులోనూ బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే మైదానాల్లో టెస్ట్ క్రికెట్ ఆడితే ఆ గ‌మ్మ‌త్తే వేరుగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ఇంగ్లీష్‌ బౌలర్‌ అండ‌ర్స‌న్ స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న తీరు అత్యుత్తమమని కొనియాడాడు. మరోవైపు ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా త‌న అమోఘ ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్‌కు వైభ‌వాన్ని తీసుకొచ్చాడని పేర్కొన్నాడు. కాగా, గురువారం ప్రారంభ‌మైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ సేన 3 వికెట్ల న‌ష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌(127) అజేయ సెంచ‌రీతో అదరగొట్టగా, రోహిత్‌ శర్మ(83), కోహ్లీ(42)లు రాణించారు. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా(9) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు రహానే(1) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌ 2, రాబిన్సన్‌కు ఓ వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు