జై బజరంగ్‌ భళి...

8 Aug, 2021 06:07 IST|Sakshi

పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం నెగ్గిన భారత రెజ్లర్‌

మూడో స్థానం పోరులో 8–0తో నియాజ్‌బెకోవ్‌పై విజయం

శీతాకాలం... తెల్లవారుజాము 2 గంటలకు ఎముకలు కొరికే చలిలో... ఓ 11 ఏళ్ల బాలుడు ఇంట్లో దిండ్లను వరుస పెట్టి దుప్పటి కప్పి తాను పడుకున్నట్లు చేసి అఖాడాకు వెళ్లేవాడు. ఉదయం అమ్మ అడిగితే 4 గంటల తర్వాతే వెళ్లానని చెప్పేవాడు. తనయుడు ఎప్పుడు వెళ్లాడో తల్లికి తెలుసు! అయినా కొడుకు ఆసక్తికి అడ్డుచెప్పకూడదని ఆ మాతృమూర్తి నిర్ణయించుకుంది. అక్కడ సీన్‌ కట్‌ చేసి టోక్యోలో చూస్తే ఆ బాలుడు బజరంగ్‌ పూనియా అయ్యాడు. రెజ్లింగ్‌ బరిలో కాంస్యం గెలిచాడు.

టోక్యో: ‘పసిడి’ పతకానికి దూరమైనా... తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్‌ పతకాన్ని భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్‌ 8–0తో దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచాడు. తద్వారా 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో నియాజ్‌బెకోవ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హాజీ అలియెవ్‌ (అజర్‌బైజాన్‌)తో జరిగిన సెమీఫైనల్లో లెగ్‌ డిఫెన్స్‌ బలహీనత, కౌంటర్‌ ఎటాక్‌లో తడబడి పాయింట్లు చేజార్చుకున్న బజరంగ్‌ ఈ బౌట్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు.

నియాజ్‌బెకోవ్‌కు ఏదశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. దాంతో నియాజ్‌బెకోవ్‌ చివరకు ఒక్క పాయింట్‌ కూడా సాధించకుండానే ఓటమి చవిచూశాడు. హరియాణకు చెందిన 27 ఏళ్ల బజరంగ్‌ తన కెరీర్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు.

బజరంగ్‌ బాహువుల్లోనో లేదంటే పిడికిలిలోనో రెజ్లింగ్‌ లేదు. అతని రక్తంలోనే మల్లయుద్ధం వుంది. ఎందుకంటే తన తండ్రి, సోదరుడు కూడా దంగల్‌ వీరులే! ఈ కుస్తీపట్లే నరనరాన జీర్ణించుకున్న బజరంగ్‌ తాజాగా ఒలింపిక్‌ పతకం పట్టాడు. అన్నట్లు ఇతనికి ఒలింపిక్‌ పతకం కొత్తేమో కానీ ఈ నంబర్‌వన్‌ (65 కేజీల కేటగిరీ) రెజ్లర్‌ ఖాతాలో ప్రపంచ, ఆసియా చాంపియన్‌ షిప్, ఆసియా గేమ్స్‌ స్వర్ణాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు సిసలు సత్తాచాటాల్సిన చోట స్వర్ణ, రజతాలు చేజార్చుకున్నాడేమో కానీ పతకం లేకుండా ఉత్తచేతులతో రాలేదు. కాంస్యం పోరు లో విజేయుడిగా నిలిచాడు.

34 కేజీల బరువుతో 60 కేజీల విభాగంలో...
మచ్రోలి గ్రామంలో 2008లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బజరంగ్‌ వెళ్లాడు. కానీ 34 కిలోల బరువున్న అతన్ని 60 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఎలాగోలా అతని అన్న హరిందర్‌ నచ్చచెప్పడంతో ఆర్గనైజర్లు అంగీకరించారు. అపుడు దంగల్‌లో దిగిన బజరంగ్‌ తనకంటే ఎక్కువ బరువున్న రెజ్లర్‌ ఓడించడం అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కుర్రాడి బాహువు బలం తెలిసిన కోచ్‌ ఆర్య వీరేందర్‌ మల్లయుద్ధంలో బజరంగ్‌ పూనియాను తీర్చిదిద్దాడు. అదే ఏడాది తండ్రి బల్వాన్‌ సింగ్‌ తనయుడిని ఢిల్లీలోని ఛత్రశాల్‌ స్టేడియంలో చేర్పించాడు. అక్కడ అందరు మేటి రెజ్లర్లే ఉండటంతో వారితో తలపడిన బజరంగ్‌ రెండేళ్లకే ఆసియా క్యాడెట్‌ చాంపియన్‌ అయ్యాడు. మరుసటి ఏడాది (2011) దాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటాబయటా పతకాల పట్టు పట్టేవాడు. 2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను సాధించిన రజతం బజరంగ్‌ను ఒలింపిక్‌ మెడలిస్ట్‌ల జాబితాలో చేర్చింది.  

యోగేశ్వర్‌ దత్‌ కిటుకులు...
ఛత్రశాల్‌ స్టేడియం చేసిన మేలు, మెరుగైన తీరు అంతా ఇంతా కాదు. అక్కడ ప్రముఖ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ సాహచర్యం... బజరంగ్‌ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం... అంతర్జాతీయ పోటీల్లో అసాధారణ రెజ్లర్‌గా, పతకాల విజేతగా నిలబెట్టాయి. యోగేశ్వర్‌ రాజకీయాల్లోకి వెళ్లాక భారత రెజ్లింగ్‌ సమాఖ్య బజరంగ్‌కు వ్యక్తిగత కోచ్‌గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్‌ను నియమించింది. ఇతని వల్ల విదేశీ రెజ్లర్లతో చేసిన ప్రాక్టీస్‌ బజరంగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతగా మార్చింది.

తల్లి ప్రోత్సాహం...
బజరంగ్‌ తల్లి ఓంప్యారీకి 11 ఏళ్ల తనయుడి అడుగులు ఎటువైపో తెలుసు. అందుకే తెల్లారుజామునే వెళ్తున్నా... ఉదయం లేచాక అబద్ధం చెబుతున్నా... మిన్నకుండిపోయింది. అయితే ఒక విషయం మాత్రం మాతృమూర్తి గట్టిగా చెప్పేది.

‘ఓడినంత మాత్రాన ఏడవొద్దు. ప్రత్యర్థుల ముందు పలుచనవ్వొద్దు. ఓటములను గెలిచేందుకు మెట్లుగా మలచుకోవాలి’ అని! ఈ మాట బాగా వంటబట్టించుకున్న బజరంగ్‌ చదువులో వెనుకబడినా... దంగల్‌లో మట్టికరిచినా... ఎప్పుడు కన్నీరు కార్చలేదు. అమ్మ అన్నట్లే ప్రతి ఓటమిని గెలుపు మలుపుగా చేసుకున్నాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింహాబలుళ్లను ఓడించే శక్తి తన తల్లి మాటల ద్వారానే సంపాదించుకున్నాడు.
 

మరిన్ని వార్తలు