Manpreet Singh: మాటలు రావడం లేదు.. ఈ విజయం వారికే అంకితం

5 Aug, 2021 13:48 IST|Sakshi

టోక్యో: ‘‘అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ భావన ఎంతో అద్భుతంగా ఉంది. తొలుత మేం 3-1 తేడాతో వెనుకంజలో ఉన్నాం. కానీ, మేం పతకానికి అర్హులమని గాఢంగా విశ్వసించాం. గత 15 నెలలుగా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. బెంగళూరులో ఉన్న సమయంలో మాలో కొంత మందికి కరోనా కూడా సోకింది. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేశాం. చివరి ఆరు సెకన్లలో వాళ్లకు పెనాల్టీ కార్నర్‌ లభించింది. ప్రాణాలకు తెగించైనా సరే దానిని అడ్డుకోవాలని భావించాం. అది నిజంగా ఎంతో కష్టతరమైనది. సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్‌ పతకం లభించింది. అవును.. మనం సాధించగలమనే విశ్వాసం పెరిగింది.

ఒలింపిక్స్‌లో గెలిస్తే ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం పెరుగుతుంది. పడి లేచాం. తిరిగి పోరాడాం. ఇప్పుడు మెడల్‌. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన భావన ’’ అని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. కాంస్య పతక పోరులో జర్మనీపై విజయం సాధించిన అనంతరం అతడు స్పందిస్తూ.. ‘‘స్వర్ణ పతకం కోసం ఇక్కడికి వచ్చాం. కాంస్యం గెలిచాం. అయినా పర్లేదు. హాకీ అభిమానులకు ఇదొక గొప్ప జ్ఞాపకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఈ విజయాన్ని కోవిడ్‌ వారియర్స్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఇక మ్యాచ్‌ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ప్రీత్‌, కోచ్‌తో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు.

గొప్ప టోర్నమెంట్‌లో పతకం
గురువారం నాటి మ్యాచ్‌లో గోల్‌తో రాణించిన రూపీందర్‌ పాల్‌ సింగ్‌.. ‘‘ఎప్పుడూ ఇంత గొప్ప ఫీలింగ్‌ కలగలేదు. గోల్డ్‌ కోసం వచ్చాం. కాంస్య పతకం గెలిచాం. అది కూడా గొప్ప టోర్నమెంట్‌లో’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున సిమ్రన్‌జీత్‌ రెండు, హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌, రూపీందర్‌ పాల్‌ సింగ్‌ ఒక్కో గోల్‌ చేసి ఆకట్టుకున్నారు. అదే విధంగా గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ అడ్డుగోడలా నిలబడి జర్మనీని గోల్స్‌ చేయకుండా కట్టడి చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

కాగా ఈ విజయంతో తాజా ఒలింపిక్స్‌లో భారత్‌ గెలిచిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం, షట్లర్‌ పీవీ సింధు కాంస్యం, బాక్సర్‌ లవ్లీనా కాంస్యం, పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించగా.. రెజ్లర్‌ రవికుమార్‌ దహియాకు ఇప్పటికే పతకం ఖాయమైంది. గురువారం అతడు ఫైనల్‌లో తలపడనున్నాడు.

మీ అభిప్రాయం చెప్పండి: Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు?

మరిన్ని వార్తలు