IND Vs NZ: దుమ్ము రేపిన కీవిస్‌ ఓపెనర్లు.. చేతులెత్తేసిన భారత బౌలర్లు

27 Nov, 2021 07:58 IST|Sakshi

రెండో రోజు న్యూజిలాండ్‌ 129/0

యంగ్, లాథమ్‌ అర్ధ సెంచరీలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 345 ఆలౌట్‌

శ్రేయస్‌ అయ్యర్‌ శతకం

కాన్పూర్‌ టెస్టు మ్యాచ్‌ 

సొంతగడ్డపై భారత్‌కు ప్రపంచ చాంపియన్‌ న్యూజిలాండ్‌ నుంచి అనూహ్య ప్రతిఘటన... ఆశించిన రీతిలో రెండో రోజు బ్యాటింగ్‌లో భారీగా పరుగులు జోడించలేకపోయిన టీమిండియా ఆ తర్వాత ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. ముగ్గురు స్పిన్నర్లు కలిసి 41 ఓవర్లు వేసినా కివీస్‌ ఓపెనర్లు అదరకుండా, బెదరకుండా ఆడి ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. శనివారం ఎవరు పైచేయి సాధించి టెస్టును శాసిస్తారనేది చూడాలి.

కాన్పూర్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. విల్‌ యంగ్‌ (180 బంతుల్లో 75 బ్యాటింగ్‌; 12 ఫోర్లు), టామ్‌ లాథమ్‌ (165 బం తుల్లో 50 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 258/4తో ఆట కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (171 బంతుల్లో 105; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా... సౌతీ (5/69) చెలరేగాడు. రెండో రోజు 27.1 ఓవర్లు ఆడిన భారత్‌ మరో 87 పరుగులే జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది.  


సౌతీ జోరు... 
సీనియర్‌ బౌలర్‌ సౌతీ రెండో రోజు భారత్‌ను గట్టిగా దెబ్బ కొట్టాడు. భారత్‌ రెండో రోజు కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు అతని ఖాతాలోనే చేరాయి. విరామం లేకుండా వేసిన తన 11 ఓవర్ల సుదీర్ఘ స్పెల్‌లో అతను పదునైన బంతులతో బ్యాటర్ల పని పట్టాడు. తన రెండో ఓవర్లోనే రవీంద్ర జడేజా (112 బంతుల్లో 50; 6 ఫోర్లు)ను బౌల్డ్‌ చేసిన అతను కొద్ది సేపటికే సాహా (1)ను కూడా పెవిలియన్‌ పంపించాడు. మరోవైపు అయ్యర్‌ మాత్రం దూకుడుగా ఆడాడు.

జేమీసన్‌ బౌలింగ్‌లో పాయింట్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీసిన అయ్యర్‌ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సౌతీ తన వరుస ఓవర్లలో అయ్యర్, అక్షర్‌ పటేల్‌ (3)లను అవుట్‌ చేసి కెరీర్‌లో 13వసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ దశలో అశ్విన్‌ (56 బంతుల్లో 38; 5 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ మెరుగైన స్కోరు సాధించగలిగింది. లంచ్‌ తర్వాత తొలి ఓవర్లోనే అశ్విన్‌ను బౌల్డ్‌ చేసిన ఎజాజ్‌... ఇషాంత్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్‌ ఆలౌటైంది.   

ఓపెనర్లు సూపర్‌...
తక్కువ ఎత్తులో వస్తున్న బంతి, ఒక్కోసారి అనూహ్యమైన బౌన్స్, టర్న్‌... ఇలాంటి పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడిన చోట కివీస్‌ బ్యాటర్లకు కూడా సమస్య తప్పదనిపించింది. అయితే ఓపెనర్లు లాథమ్, యంగ్‌ దానిని తప్పుగా నిరూ పించారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా మన ముగ్గురు స్పిన్నర్లను వారు జాగ్రత్తగా ఆడిన తీరు కివీస్‌ పట్టుదలను చూపించింది. మన పేసర్లు తొలి 7 ఓవర్లు వేయగా... వాటిలో చివరి 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా రాలేదు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నుంచే స్పిన్‌తో భారత్‌ దాడికి సిద్ధమైంది.

అయితే ఈ వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. చూస్తుండగానే భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. భారత గడ్డపై తొలిసారి ఆడుతున్న యంగ్‌ బౌండరీలతో చెలరేగగా, లాథమ్‌ అండగా నిలిచాడు. టీ విరామానికి కివీస్‌ 72/0 వద్ద నిలిచింది. చివరి సెషన్‌లోనూ భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోగా... ప్రత్యర్థి ఓపెనర్లు దూసుకుపోయారు. 88 బంతుల్లో యంగ్‌ అర్ధసెంచరీ పూర్తి కాగా, 39వ ఓవర్లో పార్ట్‌నర్‌షిప్‌ వంద పరుగులకు చేరింది. చివర్లో లాథమ్‌ 157 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకోగా, భారత బౌలర్లు ఎంత ప్ర యత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయారు.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) జేమీసన్‌ 13; గిల్‌ (బి) జేమీసన్‌ 52; పుజారా (సి) బ్లన్‌డెల్‌ (బి) సౌతీ 26; రహానే (బి) జేమీసన్‌ 35; శ్రేయస్‌ (సి) యంగ్‌ (బి) సౌతీ 105; జడేజా (బి) సౌతీ 50; సాహా (సి) బ్లన్‌డెల్‌ (బి) సౌతీ 1; అశ్విన్‌ (బి) ఎజాజ్‌ 38; అక్షర్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) సౌతీ 3; ఉమేశ్‌ (నాటౌట్‌) 10; ఇషాంత్‌ (ఎల్బీ) (బి) ఎజాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (111.1 ఓవర్లలో ఆలౌట్‌) 345. వికెట్ల పతనం: 1–21; 2–82; 3–106; 4–145; 5–266; 6–288; 7–305; 8–313; 9–339; 10–345. 

బౌలింగ్‌: సౌతీ 27.4–6–69–5; జేమీసన్‌ 23.2–6–91–3; ఎజాజ్‌ 29.1–7–90–2; సోమర్‌ విలే 24–2–60–0; రచన్‌ రవీంద్ర 7–1–28–0.  

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బ్యాటింగ్‌) 50; యంగ్‌ (బ్యాటింగ్‌) 75; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (57 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 129.  
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 6–3–10–0; ఉమేశ్‌ యాదవ్‌ 10–3–26–0; అశ్విన్‌ 17–5–38–0; జడేజా 14–4–28–0; అక్షర్‌ 10–1–26–0. 

మరిన్ని వార్తలు