Sourav Ganguly: మహిళా క్రికెట్‌ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్‌.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

10 Aug, 2022 09:41 IST|Sakshi

కామన్‌వెల్త్‌ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్‌ జట్టుపై అభ్యంతరకర ట్వీట్‌ చేసినందుకు గాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు దాదాను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకుంది. 

చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓడి కనకం గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్‌ సేన స్పూర్తివంతమైన ప్రదర్శనకు గాను ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ బాస్‌ గంగూలీ కూడా హర్మన్‌ సేనను అభినందిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. ఇందులో దాదా టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. 

"సిల్వర్‌ గెలిచినందుకు భారత మహిళా క్రికెట​జట్టుకు అభినందనలు‌.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్‌ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యంకాని ట్వీట్‌ చేశాడు. గంగూలీ చేసిన ఈ అభ్యంతరకర ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సీరియస్‌ అవుతున్నారు. అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్‌గా ఉండటం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కామన్‌వెల్త్‌ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్‌ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. 


చదవండి: నాలుగో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్‌

మరిన్ని వార్తలు