గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌పై వైరల్‌ అవుతోన్న వీడియో!

24 Apr, 2021 17:48 IST|Sakshi

సచిన్‌ టెండూల్కర్‌.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్‌ మొదలవుతాయి. సచిన్‌ ఆటకు వీడ్కోలు పలికి సుమారు ఎనిమిదేళ్లు అయిపోయింది.. అయినా ఇప్పటికి అతని గురించి ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న సగం మంది ఆటగాళ్లు అతని ఆటతీరును చూస్తూ పెరిగిన వారే. దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావించే అభిమానులు సచిన్‌ను క్రికెట్‌ దేవుడిగా అభివర్ణిస్తారు. క్రికెట్‌ ఉన్నంతకాలం సచిన్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 

1990లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆగస్టు 14న 17 ఏళ్ల వయసులో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. ఆరోజు మొదలైన సెంచరీల మోత నిరంతరాయంగా 23 ఏళ్ల పాటు కొనసాగింది. 1989లో అరంగేట్రం చేసిన సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లను  సొంతం చేసుకుని గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ అయ్యాడు.  సచిన్‌ టెండూల్కర్‌ 48వ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’ వీడియో వైరల్‌ అవుతోంది. అసలు సచిన్‌ ఎలా క్రికెట్‌ గాడ్‌ అయ్యాడో తెలుపుతు అతని వీరాభిమాని రూపొందించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

కాగా, సచిన్‌ టెండూల్కర్‌ బర్త్‌డే సందర్భంగా అతనికి ప్రముఖుల నుంచి విశేషంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు క్రికెట్‌  ప్రముఖలతో పాటు ఐసీసీ, బీసీసీఐలు కూడా సచిన్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలియజేశాయి. సచిన్‌కు అభినందనలు తెలిపిన కొంతమందిలో విరాట్‌ కోహ్లి, వెంకటేశ్‌ ప్రసాద్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా,  అజింక్యా రహానే తదితరులు ఉన్నారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లు సచిన్‌కు అభినందనలు తెలిపాయి. 

ఇక్కడ చూడండి:  సచిన్‌ బర్త్‌డే స్పెషల్‌ ఫోటో స్టోరీ

వైరల్‌ అవుతోన్న వీడియో

బర్త్‌డే సందర్భంగా సచిన్‌ షేర్‌ చేసిన వీడియో

మరిన్ని వార్తలు