Virat Kohli Jersey Gift: 12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లి.. ఎవరా వ్యక్తి?

7 Mar, 2022 06:50 IST|Sakshi

మొహలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి వందో టెస్టు అన్న మాటేగాని మొత్తం జడేజా మ్యాచ్‌గా మారిపోయింది. తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కోహ్లికి మంచి బహుమతి అందించాడు. మొదట బ్యాటింగ్‌లో 175 పరుగులు నాటౌట్‌, ఆ తర్వాత బౌలింగ్‌లో తన మ్యాజిక్‌ ప్రదర్శిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు..  మలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు.. ఓవరాల్‌గా తొమ్మిది వికెట్లు తన ఖాతాలో వేసుకొని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

ఇక కోహ్లికి తన వందో టెస్టులో ఒకసారే బ్యాటింగ్‌ అవకాశం వచ్చినప్పటికి 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వలేదని అనుకున్నాడేమో.. ఫీల్డింగ్‌ చేసే సమయంలో ఫ్యాన్స్‌ను ఎంకరేజ్‌ చేయడం వైరల్‌గా మారింది. ముఖ్యంగా అల్లుఅర్జున్‌ పుష్ప సినిమాలోని డైలాగులు చెబుతూ ఆడియెన్స్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేశాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి టీమిండియా అన్‌అఫీషియల్‌ 12వ ఆటగాడికి తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఆ అన్‌ అఫీషియల్‌ 12వ ఆటగాడు ఎవరనే కదా మీ డౌటు.. అతనే ధరమ్‌వీర్‌ పాల్‌.

ఎవరీ ధరమ్‌వీర్‌ పాల్‌...
మధ్యప్రదేశ్‌కు చెందిన ధరమ్‌వీర్‌ పాల్‌ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. క్రికెట్‌ను ప్రాణంగా భావించే ధరమ్‌వీర్‌ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు వస్తుంటాడు. అంగవైకల్యం తనకు ఇష్టమైన క్రికెట్‌ను ఏనాడు ఆపలేదని.. అందుకే టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఎంతదూమైనా వెళ్తుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే పలువురు టీమిండియా ఆటగాళ్లకు ధరమ్‌వీర్‌ పాల్‌ అభిమానిగా మారిపోయారు. ఆ లిస్ట్‌లో కోహ్లి కూడా ఉ‍న్నాడు. దీంతో ధరమ్‌వీర్‌ను ఫ్యాన్స్‌ టీమిండియా అన్ అఫీషియల్‌ 12వ ఆటగాడిగా పిలుస్తుంటారు.

ఇక మొహలీలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా బస్సులో బయలుదేరేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో ధరమ్‌వీర్‌ పాల్‌ బస్సు దగ్గరికి వచ్చాడు. ఇది గమనించిన కోహ్లి బస్సు నుంచి కిందకు దిగి అతని వద్దకు వచ్చి తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోనూ ధరమ్‌వీర్‌ తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకున్నాడు. ''థాంక్యూ సో మచ్‌ చాంపియన్‌.. నువ్వు ఎప్పటికి నా చాంపియన్‌వే.. ఇంకా కొన్నేళ్లు నీ ఆట నిరంతరాయంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అంటూ కోహ్లికి సందేశాన్ని అందించాడు.

ఇక 2017లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ధరమ్‌వీర్‌ కొన్ని ముఖ్యవిషయాలు వెల్లడించాడు. సచిన్‌ పాజీ, ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌, సెహ్వాగ్‌, కోహ్లి లాంటి ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. ఎన్నోసార్లు నాకు సాయమందించారు. వారికి కృతజ్ఞతుడిగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక మధ్యప్రదేశ్‌ 
దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ధరమ్‌వీర్‌ పాల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం విశేషం. 

చదవండి: Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు!

మరిన్ని వార్తలు