T20 Captaincy Record: 'ఆ ఒక్కటి' మినహా.. ధోనితో పోలిస్తే కోహ్లినే బెటర్‌..!

17 Sep, 2021 17:03 IST|Sakshi

Virat Kohli Better Than MS Dhoni As T20I Captain: పొట్టి ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో అతని నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కోహ్లి తొందరపడ్డాడని కొందరు అంటుంటే.. మరికొందరు అతని నిర్ణయం సరైందేనని.. ఇది బ్యాట్స్‌మెన్‌గా అతనికి మేలు చేస్తుందని అంటున్నారు. టీ20ల్లో కెప్టెన్‌గా కోహ్లికి ఘనమైన రికార్డే ఉన్నప్పటికీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అర్ధం కావట్లేదని కోహ్లి వీరాభిమానులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఒక్క ఐసీసీ ట్రోఫి గెలవడం మినహా దాదాపు అన్ని విషయాల్లో దిగ్గజ కెప్టెన్‌ ధోని కంటే కోహ్లినే చాలా బెటర్‌ అని, ఇందుకు గణాంకాలే ఉదాహరణ అంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 

ఇప్పటివరకూ కోహ్లి సారథ్యంలో టీమిండియా 45 టీ20 మ్యాచ్‌లు ఆడగా 27 మ్యాచ్‌ల్లో గెలిచింది. అతని విజయాల శాతం 65.11గా ఉంది. ఈ క్రమంలో అత్యధిక విజయాలు సాధించిన టీ20 కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో అఫ్గనిస్తాన్‌ సారధి అస్గర్ అఫ్గాన్ 80.77 విజయాల శాతంతో టాప్‌లో ఉండగా.. కోహ్లీ 64.44 శాతంతో రెండో స్థానంలో నిలిచాడు. వీరి తర్వాతి స్థానాల్లో  ఫాఫ్ డుప్లెసిస్(62.50), ఇయాన్ మోర్గాన్(60.94), డారెన్ స్యామీ(59.57), మహేంద్ర సింగ్ ధోనీ(58.33) ఉన్నారు. మరోవైపు పొట్టి ఫార్మాట్లో సేనా దేశాల(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా)పై వారి స్వదేశాల్లో సైతం కోహ్లికి ఘనమైన రికార్డే ఉంది. 

అతని సారథ్యంలో టీమిండియా 2018లో  సౌతాఫ్రికా, ఇంగ్లండ్(2018), న్యూజిలాండ్ (2020), ఆస్ట్రేలియా(2020)లపై సిరీస్ విజయాలు సాధించింది. ఇక కోహ్లి నేతృత్వంలో టీమిండియా గత 10 టీ20 సిరీస్‌ల్లో 9 సిరీస్‌లను కైవసం చేసుకుని పొట్టి క్రికెట్‌లో తిరుగులేని జట్టుగా చలామణి అవుతోంది. ఇలాంటి తరుణంలో కోహ్లి అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, పని భారం వల్ల టీమిండియా టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని.. టెస్ట్, వన్డే‌ల్లో కెప్టెన్‌గా యధావిధిగా కొనసాగుతానని కోహ్లి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఓ పోస్ట్‌ను షేర్‌ చేశాడు. కెప్టెన్‌గా తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. 
చదవండి: ‘కోహ్లి నిర్ణయం సరైందే.. ఆ అర్హత ఉంది.. తను టీ20 వరల్డ్‌కప్‌ గెలవాలి’

మరిన్ని వార్తలు