Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం

7 Sep, 2021 09:21 IST|Sakshi

Virat Kohli... ''ఇలాంటి విజయం వస్తుందని ఊహించలేదు.. మా కుర్రాళ్లు నిజంగా అద్భుతం చేశారు.'' ఇవి మ్యాచ్‌ విజయం తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు. ఇంగ్లండ్‌పై నాలుగో టెస్టులో 157 పరుగులతో ఘన విజయం అందుకున్న భారత్‌ ఓవల్‌ మైదానంలో 50 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. 1971లో ఈ మైదానంలో అజిత్‌ వాడేకర్‌ సారధ్యంలో ఆఖరి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా ఆ తర్వాత ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు ఆడి ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మూడింటిలో ఓడింది. తాజా విజయంతో కోహ్లి చరిత్ర సృష్టించాడు. మ్యాచ్‌ విజయం అనంతరం మీడియాతో కోహ్లి మాట్లాడాడు. 

‘‘మేం గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు పట్టుదల చూపించారు. గెలవాలనే కసితో ఆడారు. ఈ మ్యాచ్‌లో మేం డ్రా కోసం ప్రయత్నించలేదు. గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం.  అలాగే ఈ జట్టులోని ముగ్గురు టాప్‌ బౌలర్ల ప్రదర్శన చూసిన కెప్టెన్‌గాను ఎంతో సంబరపడుతున్నా. ఇక ఈ మ్యాచ్‌లో వాతావరణం వేడిగా ఉండటంతో మేం గెలిచే అవకాశం ఉందని ముందే అనుకున్నాం. ఈ క్రమంలోనే బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, జడేజా మాయచేశారు. ముఖ్యంగా బంతి రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉందని తెలియగానే బుమ్రా బంతి ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి బంతి ఇవ్వగానే రెండు (ఓలీపోప్‌, బెయిర్‌స్టో) కీలక వికెట్లు తీశాడు. ఇక రోహిత్‌, శార్దూల్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు.

ముఖ్యంగా శార్దూల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెరిశాడు. అతడి ప్రదర్శన అత్యద్భుతం. అతడి రెండు అర్ధశతకాలు ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాయి. అయితే, ఈ విజయాన్ని ఆస్వాదించడానికి కోచ్‌ రవిశాస్త్రి, ఇతర సిబ్బంది అందుబాటులో లేరు. అయినా, ఈ విజయాన్ని చూసి ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లంతా సంతోషిస్తారు. ఈ గెలుపు రాబోయే మ్యాచ్‌లో మాకు ప్రేరణగా నిలుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఇక మా గురించి బయట ఎవరేమునుకున్నా పట్టించుకోం. ఏ నిర్ణయమైనా జట్టంతా కలిసే తీసుకుంటాం’’ అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు.

చదవండి: Jasprit Bumrah: బుమ్రా తొలి వికెట్‌.. వందో వికెట్‌ ఒకేలా.. 

చదవండి: రోహిత్ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌.. ఐదో రోజు హైలైట్స్‌ ఇవే

మరిన్ని వార్తలు