Rishabh Pant: సుశీల్‌ జీ మీకు రుణపడిపోయాం.. లక్ష్మణ్‌ ట్వీట్‌ వైరల్‌; ‘రియల్‌ హీరో’లకు తగిన గౌరవం

31 Dec, 2022 13:22 IST|Sakshi

Rishabh Pant Accident- VVS Laxman Hails Bus Driver: ‘‘మంటల్లో కాలిపోతున్న కారులో నుంచి రిషభ్‌ పంత్‌ను బయటకు తీసి.. బెడ్‌షీట్‌ చుట్టి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి.. తనను కాపాడిన హర్యానా డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌కు ధన్యవాదాలు. మీరు చేసిన సేవకు కృతజ్ఞులం. సుశీల్‌ జీ మీకు రుణపడిపోయాం’’ అంటూ టీమిండియా దిగ్గజం, జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు.

టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రాణాలతో బయటపడటానికి కారణమైన బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌ను రియల్‌ హీరోగా అభివర్ణించాడు. అదే విధంగా.. కండక్టర్‌ పరంజిత్‌కు కూడా లక్ష్మణ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. 

పెద్ద మనసు
రిషభ్‌ను కాపాడే క్రమంలో పరంజిత్‌.. సుశీల్‌కు సాయం చేశాడన్న లక్ష్మణ్‌.. వీరి సమయస్ఫూర్తికి సలాం కొట్టాడు. పంత్‌ను ప్రాణాలతో రక్షించిన సుశీల్‌, పరంజిత్‌లది పెద్ద మనసు అంటూ హ్యాట్సాఫ్‌ చెప్పాడు. కాగా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

ఈ యువ వికెట్‌ కీపర్‌ స్వయంగా కారు నడుపుకొంటూ స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన సుశీల్‌ వెంటనే తమ బస్సు నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్‌ను మరికొంత మంది సాయంతో బయటకు తీశాడు.

ఈ నేపథ్యంలో గాయాలతో బయటపడ్డ పంత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతోంది. కాగా భయంకరమైన యాక్సిడెంట్‌ నుంచి 25 ఏళ్ల పంత్‌ ప్రాణాలతో బయటపడటంలో సుశీల్‌ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వాళ్లకు ప్రోత్సాహకం
టీమిండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను ప్రమాదం నుంచి కాపాడిన వారందరికీ సముచిత గౌరవం దక్కనుంది. ఈ విషయం గురించి ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు మొదటి గంట సమయం అత్యంత కీలకం.

గోల్డెన్‌ పీరియడ్‌. ఆ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడిని కాపాడిన వాళ్లను ప్రోత్సహించేందుకే కేంద్రం ది గుడ్‌ సామరిటన్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టింది’’ అని తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్య సేవ అందేలా చేసిన వారికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. 

చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
ఘనంగా షాహిద్‌ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్‌ ఆఫ్రిది

మరిన్ని వార్తలు