‘సచిన్‌లానే.. ధోనికి వీడ్కోలు ఉంటుంది’

18 Aug, 2020 13:41 IST|Sakshi

న్యూఢిల్లీ :  టీమీండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అప్ప‌టినుంచి ధోనికి గొప్ప‌గా వీడ్కోలు ప‌లికేందుకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఎక్కడ నిర్వ‌హిస్తారన్న దానిపై ప‌లు ఊహాగాహానాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ స్పందించారు. ‘వాంఖ‌డే స్టేడియంలో స‌చిన్ టెండూల్క‌ర్ ఎలా అయితే చివ‌రి మ్యాచ్ ముగించాడో ధోని కూడా చెపాక్ స్టేడియంలో చివ‌రి మ్యాచ్ ఆడ‌తాడ‌ని నేను న‌మ్ముతున్నాను’ అని అన్నారు. 'ధోనికి సీఎస్‌కే ( చెన్నై సూప‌ర్ కింగ్స్ ) ప‌ట్ల అమిత‌మైన‌ ప్రేమ, మ‌క్కువ ఉన్నాయ‌ని మ‌న‌మంద‌రం గుర్తించాలి.  సీఎస్‌కే జ‌ట్టుకు ట్రోఫీ అందించడానికి సాధ్య‌మైనవ‌న్నీ ధోని చేశాడు. ధోని లాంటి గొప్ప నాయ‌క‌త్వం వ‌ల్లే సీఎస్‌కె అత్యంత విజ‌య‌వంత‌మైన ఫ్రాంచైజీగా మ‌న్న‌న‌లు అందుకుంది. (ధోని అధ్యాయం ఎన్నటికీ చెరిగిపోనిది)

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలోనే ధోని త‌న చివ‌రి మ్యాచ్ ఆడ‌తార‌ని భావిస్తున్నాను. క్రికెట్ స్టేడియంలో ధోనీ గ‌డిపే ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆనందించేందుకు ప్ర‌పంచ‌మంతా ఎదురుచూస్తుంది. స‌చిన్ హోమ్‌ గ్రౌండ్‌ అయిన వాంఖడే స్టేడియంలో అతని చివ‌రి మ్యాచ్ ఎలా జ‌రిగిందో, ధోని కూడా చెపాక్‌లో ఫేర్‌వెల్ మ్యాచ్ ఉండే అవ‌కాశం ఉంది' అని వీవీఎస్ లక్ష్మ‌ణ్ జోస్యం చెప్పాడు.

గతేడాది వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ త‌ర్వాత ధోని మ‌ళ్లీ క్ల‌బ్ స్థాయి క్రికెట్ కూడా ఆడ‌లేదు. కోట్లాది అభిమానుల్ని నిరాశకు గురిచేస్తూ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాడు.16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లుకుతూ త‌ప్పుకుంటున్న‌ట్లు స్వ‌యంగా ధోని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. దీంతో ధోనికి గొప్ప‌గా వీడ్కోలు పలికేందుకు అతని స్వ‌స్థ‌లం రాంచీలో ఓ ఫేర్‌వెల్ మ్యాచ్‌ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరిన సంగ‌తి తెలిసిందే. (‘ధోని ఆడకపోతే నేనూ మ్యాచ్‌లు చూడను’)


 

>
మరిన్ని వార్తలు