WFI: సస్పెన్షన్‌ ఎత్తివేయాల్సిందే! మా దగ్గర సాక్ష్యాలున్నాయి!

25 Dec, 2023 08:30 IST|Sakshi

WFI New President Sanjay Singh Comments: భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ కేంద్ర క్రీడా శాఖను కోరారు. తమకు సమయమిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో నిబంధనల్ని అతిక్రమించలేదని నిరూపిస్తామనన్నారు. అలా కాదని సస్పెన్షన్‌ను కొనసాగిస్తే మాత్రం సహించబోమని.. కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు.

వేటు వేసిన క్రీడా శాఖ
కాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఓ అడుగు ముందుకేస్తే... రెండడుగులు వెనక్కి అన్నట్లుంది వ్యవహారం. మహిళా రెజ్లర్ల పోరాటం, పోలీసు కేసులు, హైకోర్టు స్టేలను దాటుకొని ఎట్టకేలకు సమాఖ్యకు ఎన్నికలు జరిగి, కొత్త కార్యవర్గం ఏర్పాటైందన్న ముచ్చట మూణ్నాళ్ల ముచ్చటే అయింది. డబ్ల్యూఎఫ్‌ఐపై కేంద్ర క్రీడాశాఖ సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే.

ఏకపక్ష నిర్ణయాలు సహించేది లేదు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడైన సంజయ్‌ సింగ్‌ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇలా ఎన్నికయ్యారో లేదో అప్పుడే స్వామిభక్తి మొదలుపెట్టారు. అండర్‌–15, అండర్‌–20 జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను బ్రిజ్‌భూషణ్‌ హవా నడిచే గోండా (యూపీ) పట్టణంలో నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఈ ఏకపక్ష విధానంపై కేంద్ర క్రీడాశాఖకు డబ్ల్యూఎఫ్‌ఐ కార్యదర్శి ప్రేమ్‌చంద్‌ ఫిర్యాదు చేయడంతో వెంటనే సమాఖ్యను సస్పెండ్‌ చేసింది. ‘కొత్త కార్యవర్గం ఏకపక్ష నిర్ణయంతో డబ్ల్యూఎఫ్‌ఐ నియమావళిని అతిక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌ వేటు వేశాం.

ఇది అమల్లో ఉన్నంతవరకు సమాఖ్య రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం లేదు’ అని క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఏ జూనియర్, సబ్‌–జూనియర్, సీనియర్‌ టోర్నమెంట్‌ అయినా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోనే చర్చించి నిర్ణయించాలి.

కొంపముంచిన స్వామిభక్తి
కానీ సంజయ్‌ మితిమీరిన స్వామిభక్తితో ఏకపక్ష నిర్ణయం తీసుకొని అడ్డంగా బుక్కయ్యారు. తాజా సస్పెన్షన్‌తో గోండాలో ఈనెల 28 నుంచి 30 వరకు జరగాల్సిన పోటీలు వాయిదా పడ్డాయి.  అయితే, ఈ విషయంపై స్పందించిన సంజయ్‌ సింగ్‌.. ‘‘టోర్నీల నిర్వహణ విషయంలో డబ్ల్యూఎఫ్‌ఐ ‘నియామావళి’ ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాం.

ఇది నా ఒక్కడి ఏకపక్ష నిర్ణయం కానేకాదు. 24 రాష్ట్ర సంఘాలను సంప్రదించిన మీదటే టోర్నీ ఆతిథ్య వేదికను ఖరారు చేశాం. అన్నింటికి ఈ–మెయిల్‌ సాక్ష్యాలున్నాయి. కావాలంటే వీటిని నిరూపిస్తాం’’ అని సవాల్‌ విసిరారు.  

చదవండి: PKL 2023: పవన్‌ పోరాటం వృథా 

>
మరిన్ని వార్తలు