WFI: మంచో చెడో.. రిటైర్‌ అయ్యా.. నాకేం సంబంధం లేదు! డబ్ల్యూఎఫ్‌ఐ మంచికి నాంది

25 Dec, 2023 09:36 IST|Sakshi

Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ విధించడాన్ని రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్‌ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు.  

వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు
ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేత బజరంగ్‌ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. 

సంజయ్‌ సింగ్‌కు షాకిచ్చిన క్రీడా శాఖ
కాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌ సింగ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగట్‌ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్‌ పునియా, జితేందర్‌ సింగ్‌ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్‌ అనిత షెరాన్‌ ప్యానెల్‌పై.. బ్రిజ్‌భూషణ్‌ అనుచరుడు సంజయ్‌ సింగ్‌ ప్యానెల్‌ విజయం సాధించింది. 

ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్‌ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్‌ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్‌ పునియా, బధిర రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. 

ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్‌ సింగ్‌ ప్యానెల్‌పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్‌ భూషణ్‌ జోక్యంతోనే సంజయ్‌ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్‌ఐపై సస్పెన్షన్‌ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

మంచో.. చెడో.. రిటైర్‌ అయ్యాను.. నాకేం సంబంధం లేదు
ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌ అయ్యానంటూ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌ అయ్యాను.

సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్‌సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్‌ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్‌భూషణ్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 

చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు