నరేంద్ర మోదీ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

25 Feb, 2021 05:34 IST|Sakshi

కొత్త స్టేడియానికి కొత్త పేరు

ప్రారంభిచేదాకా గోప్యత

ప్రేక్షకుల సామర్థ్యం లక్షా 32 వేలు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానం

అహ్మదాబాద్‌: కొత్తగా నిర్మించిన స్టేడియానికి కొత్త పేరు పెట్టారు. ‘ఉక్కుమనిషి’ సర్దార్‌ పటేల్‌ పేరుతో ఉన్న మైదానానికి ఉక్కు సంకల్పంతో అడుగువేసే భారత ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం’గా మార్చారు. అయితే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించేదాకా పేరు మార్పుపై గోప్యత పాటించారు. లాంఛనంగా ప్రారంభించాక రాష్ట్రపతి మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానం భారత్‌లో ఉండటం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు 90 వేల సీట్ల సామర్థ్యమున్న మెల్‌బోర్న్‌ స్టేడియంను చూశానని... అదే అప్పుడు అతిపెద్ద మైదానమని ఇప్పుడు అతిపెద్ద స్టేడియానికి భారత్‌ వేదికయిందని కోవింద్‌ వివరించారు.

మోదీ పేరెందుకంటే...
గుజరాత్‌ క్రికెట్‌ సంఘం(జీసీఏ)లో భాగమైన ఈ స్టేడియం కాబట్టి అంతా సర్దార్‌ పటేల్‌ పేరుతోనే కొత్తగా ముస్తాబైందనుకున్నారు. బుధవారం జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో నూతన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోనే పింక్‌బాల్‌ టెస్టు అనే రాశారు. కానీ రాష్ట్రపతి ఆవిష్కరించే సరికి ఇది మోదీ మైదానమని బయటపడింది. ఇది ఇప్పటి ప్రధాని, ఒకప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. సీఎంగా ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని స్టేడియాల్ని తలదన్నేలా ఓ ఎవరెస్ట్‌ అంతటి క్రికెట్‌ మైదానాన్ని నిర్మించాలనే సంకల్పంతో మోదీ పునాదిరాయి వేశారు. ఆఖరిదాకా అదే సంకల్పంతో పూర్తి చేశారు కాబట్టే మోదీ స్టేడియంగా మన ముందుకొచ్చింది.

సర్దార్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌...
మోదీ స్టేడియం ఆవిష్కరించినప్పటికీ సర్దార్‌ పటేల్‌ నామఫలకం కనుమరుగేం కాలేదు. ఎందుకంటే 17 ఎకరాల సువిశాల ప్రాంగణంలోనే ‘ది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌’కు రాష్ట్రపతి భూమిపూజ చేశారు. ఇందులో ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్‌టెన్నిస్‌ తదితర స్టేడియాలను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్నారు. అధునాతన సదుపాయాలతో బహుళ క్రీడా మైదానాల సముదాయంగా సర్దార్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు అంతర్జాతీయ స్థాయి మెరుగులు దిద్దనున్నారు. అందుకే ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ ఇప్పుడు అహ్మదాబాద్‌ క్రీడానగరిగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు.

 

మరిన్ని వార్తలు