కల్యాణ మహోత్సవాన్ని.....

31 Mar, 2023 00:50 IST|Sakshi

కల్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు

మంగళసూత్రాన్ని చూపుతున్న వేదపండితుడు

వైభవంగా సీతారాముల

కల్యాణ మహోత్సవం

రామయ్య నామస్మరణతో పులకించిన శ్రీరామకోటి స్తూప ప్రాంగణం

పట్టువస్త్రాలు సమర్పించిన

మంత్రి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(బృందావనం): శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గురువారం సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నెల్లూరులోని శబరి శ్రీరామక్షేత్రం దగ్గర టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీరామకోటి స్తూప ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు, జై శ్రీరాం నామస్మరణ నడుమ సీతాదేవికి, కోదండరాముడికి కనుల పండువగా కల్యాణం జరిగింది. సీతాదేవి, కోదండరాముడు విశేషాలంకారంలో శబరి శ్రీరామక్షేత్రం నుంచి కల్యాణ వేదికై న శ్రీరామకోటి స్తూప ప్రాంగణానికి మేళతాళాల నడుమ తరలివచ్చారు. సంప్రదాయంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, విజిత దంపతులు పట్టువస్త్రాలను, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, కిరణ్మయి దంపతులు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వేదపండితులు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కల్యాణోత్సవ వ్యాఖ్యాతలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆకెళ్ల విభీషణశర్మ, సాయినాథాచార్యులు వ్యవహరించారు. ఆధ్యాత్మిక చింతన, సామాజిక బాధ్యతలను సీతారాముల దాంపత్య జీవితంతో సమన్వయపరుస్తూ వివరించారు. కల్యాణ ఉభయకర్తలుగా పిడూరు కిశోర్‌రెడ్డి – శరణ్య, పిడూరు భానుప్రకాష్‌రెడ్డి – నాగమణి దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలను శబరి శ్రీరామక్షేత్రం భక్తబృందం, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ, పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాసులు, గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమ కమిటీ సభ్యుడు ఆల్తూరు గిరీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎండోమెంట్‌ ఆఫీసర్‌ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

● కల్యాణోత్సవం అనంతరం స్వామికి సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, తలంబ్రాల బియ్యం (అక్షతలు), అన్నప్రసాదాన్ని టీటీడీ కల్యాణ మండపంలో వేలాదిమంది భక్తులకు వితరణ చేశారు.

● శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ భక్తులు రాసిన శ్రీరామకోటి పుస్తకాలను ప్రాంగణంలోని స్తూపంలో గురువారం సాయంత్రం నిక్షిప్తం చేశారు.

మానవాళికి ఆదర్శప్రాయం: కాకాణి

మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శ్రీరామచంద్రుడి జీవితం సకల మానవాళికి ఆదర్శప్రాయమని మంత్రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 23 సంవత్సరాల నుంచి శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవాలను జయప్రదంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ధర్మరక్షణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలనే శ్రీరాముడి జీవితం ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమన్నారు. జీవితంలో ఆచరించాల్సిన, సాధించాల్సిన వాటిని స్వయంగా ఆచరించి చూపిన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడన్నారు.

పిల్లలకు వివరించాలి: కలెక్టర్‌

కుమారుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా కుటుంబంలో అన్ని బంధాలకు ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుడు సకలగుణాభి రాముడని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అన్నారు. ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మనిషిలోని బలాలు, బలహీనతలతోసహా అన్ని విషయాలను స్పృశించిన అద్భుత మహాకావ్యం రామాయణమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రామాయణం గురించి వివరించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్తున్న

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌బాబు

తలంబ్రాలు, కల్యాణోత్సవ సామగ్రిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు

మరిన్ని వార్తలు