ప్రజానేత రాయసం వెంకటేశ్వరరావు | Sakshi
Sakshi News home page

ప్రజానేత రాయసం వెంకటేశ్వరరావు

Published Wed, Nov 8 2023 12:38 AM

రాయసం వెంకటేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న  - Sakshi

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ఇందుకూరుపేట : ప్రజానేతగా, అజాత శత్రువుగా రాయసం వెంకటేశ్వరరావు కీర్తి గడించారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గంగపట్నం గ్రామంలో మాజీ సర్పంచ్‌ రాయసం వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని మంగళవారం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2004 సునామీ సమయంలో ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఆహారం, పునరావాసం ఏర్పాటు చేసి అండగా నిలిచారన్నారు. గ్రామానికి సేవ చేసుకునే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని, దానిని అద్భుతంగా వినియోగించుకుని గ్రామాభివృద్ధికి కృషి చేశారని వివరించారు. రెండుసార్లు సర్పంచ్‌గా, మూడు దఫాలు ఉపసర్పంచ్‌గా ఆయన చేసిన సేవలు అమోఘమని కీర్తించారు. వెంకటేశ్వరరావు కుమారులు వాసుదేవరావు, దామెదర్‌రావు, హృషీకేశవరావు ఆయన జాడల్లో నడవాలని ఆకాంక్షించారు.

ప్రజాసేవకు నిర్వచనం – ఎమ్మెల్యే ప్రసన్న

వెంకటేశ్వరరావు నాయుడు తన 80 ఏళ్ల జీవితంలో ప్రజాసేవకు నిర్వచనం చెప్పిన సామాన్యుడు అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రశంసించారు. కొంత మంది మాత్రమే మనస్సున్న నేతలుగా నిలిచిపోతారని, ఆ కోవకు చెందిన వ్యక్తి వెంకటేశ్వరరావు నాయుడు అని చెప్పారు. ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రసన్న పేర్కొన్నారు.

Advertisement
Advertisement