ఇంకా కొన్ని పల్లెలకు చేరని ‘మహాలక్ష్మి’ భాగ్యం!

25 Dec, 2023 12:06 IST|Sakshi
చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో బస్సు సౌకర్యం లేక ఆటో ఎక్కుతున్న మహిళలు

పల్లె మహిళలకు అందని పథకం

గ్రామాలకు వెళ్లని ఆర్టీసీ బస్సులు

ఉచితమున్నా ప్రయోజనం లేదంటున్న గ్రామీణ మహిళలు

బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని వేడుకోలు

చిలుకూరు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ పలు గ్రామాల్లోని మహిళలకు ఈ పథకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో గ్రామీణ మహిళలు ఈ పథకానికి దూరమవుతున్నారు. తాము ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నామని, పల్లెలకు బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు.

జిల్లాలో ఇలా..
జిల్లాలో కోదాడ, సూర్యాపేట డిపోలు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 40, ఎక్స్‌ప్రెస్‌లు 18 ఉన్నాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 62, ఎక్స్‌ప్రెస్‌లు 45 ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో మరో 25 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలోని చిలుకూరు మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం జాతీయ రహదారిపై ఉన్న చిలుకూరు మండల కేంద్రం, సీతారాంపురం గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.

బేతవోలు, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, నారాయణపురం తదితర ప్రధాన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అదేవిధంగా మునగాల మండల పరిధిలోని 22 గ్రామాలకు నరసింహులగూడెం తప్ప ఏ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ప్రధానంగా నేలమర్రి, కలకోవ, జగన్నాథపురం తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. నడిగూడెం మండల పరిధిలో నడిగూడెంతో పాటు రామచంద్రాపురం, సిరిపురం, రత్నవరం తదితర ప్రధాన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు.

కోదాడ మండల పరిధిలో ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారిలో తప్ప మిగిలిన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. హుజూర్‌నగర్‌ పరిధిలో సైతం జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామాలు, ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాలకు వెళ్లే రహదారులకు తప్ప మిగిలిన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. ఇక.. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో కండగట్ల, యల్కారం, సోల్‌పేట, రామచంద్రాపురం, లోయపల్లి, కుంచమర్తి, మాచిడిరెడ్డి పల్లి, మామిడిపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.

బస్సు సౌకర్యం కల్పించాలి
మా గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. దీంతో మేము ఉచిత బస్సు ప్రయాణం పథకానికి దూరమవుతున్నాం. గతంలో మా గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. కేవలం ఆటోలే దిక్కు. పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – కల్పన, జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం

కేవలం ప్రధాన రహదారులకే..
కరోనా అనంతరం ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆదాయం రావడం లేదని, పల్లెలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. దీనికి తోడు కాలం చెల్లిన వాటి స్థానంలో నూతన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో కేవలం ఆదాయం వచ్చే ప్రధాన రహదారుల్లోనే బస్సులు నడపిస్తున్నారు.

తాజాగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో తమ గ్రామాలకు బస్సులను నడపాలని గ్రామీణ ప్రాంత మహిళలు వేడుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు