పేదలకు ఆరోగ్యమస్తు | Sakshi
Sakshi News home page

పేదలకు ఆరోగ్యమస్తు

Published Mon, Dec 25 2023 1:54 AM

- - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): రోజురోజుకూ వైద్యం అత్యంత ఖరీదుగా మారుతుండటంతో పేదలు చికిత్స చేయించుకోలేని దుస్థితి నెలకొంది. ఏదైనా పెద్ద రోగం వస్తే ఆస్తులు అమ్ముకొనో.. అప్పులు చేసే వైద్యం చేయించుకోవాల్సి వచ్చేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితిని గమనించిన మాజీ సీఎం దివంగత వైఎస్సార్‌ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పొందే ప్రయోజన పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల వరకు వైద్యసేవలు పొందే వీలుంది. ఇది నిరుపేదలకు వరంగా మారనుంది. ఈ పథకంతో జిల్లాలో 3,24,224 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.

ఆహార భద్రత కార్డు ఉంటే చాలు..

ఆహార భద్రత కార్డు కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులే. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం ద్వారా ఖరీదైన చికిత్సలన్నీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా గుండె, డయాలసిస్‌ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రత్యేక ప్యాకేజీల్లో సేవలు..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో 1,672 విభాగాల్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. వాటిలో శస్త్ర చికిత్సలకు సంబంధించి 1,383, మెడికల్‌కు సంబంధించి 289 ప్యాకేజీల్లో సేవలు అందనున్నాయి. ఆహార భద్రత కార్డులు కలిగిన వారు ఎముకలు, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, డయాలసిస్‌ సేవలతోపాటు ఆ పథకంలో పొందుపరిచిన వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. రోగులకు రవాణా, ఆహారం, మందులకయ్యే ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుంది. 126 రకాలైన వ్యాధులకు సంబంధించి చేసిన చికిత్సలకు ఏడాది పాటు ఉచితంగా మందులను సరఫరా చేస్తారు. రోగులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డును తమ వెంట తీసుకుని ఆస్పత్రికి వెళ్తే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బృందం పరిశీలించి వారికి ఉచితంగా వైద్య సేవలందించేందుకు ఆమోదిస్తుంది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అందరికీ ఈ పథకం రూ.10 లక్షల వరకు వైద్య సేవలందిస్తారు.

ఫ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షల

నుంచి రూ.10లక్షలకు పెంపు

ఫ జిల్లాలో 3.24 లక్షల కుటుంబాలకు ప్రయోజనం

Advertisement
Advertisement