త్వరలో తిల్లై పెరుమాల్‌ బ్రహ్మోత్సవాలు

10 Nov, 2023 05:30 IST|Sakshi
చిదంబరం తిల్లై గోవిందరాజ పెరుమాల్‌ ఆలయం
● 400 ఏళ్ల తర్వాత నిర్వహణకు దేవదాయశాఖ నిర్ణయం

సాక్షి, చైన్నె: చిదంబరంలో కొలువు దీరిన తిల్లై గోవిందరాజ పెరుమాల్‌కు బ్రహ్మోత్సవం నిర్వహించేందుకు హిందూ దేవదాయ శాఖ నిర్ణయించింది. 400 ఏళ్ల అనంతరం ఇక్కడ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టడం గమనార్హం. వివరాలు.. కడలూరు జిల్లా చిదంబరంలో నటరాజ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇదే ఆలయంలో తిల్లై గోవిందరాజ పెరుమాల్‌ ఆలయం కూడా ఉంది. పరమ శివుడు, గోవిందరాజ స్వామి ఒకే ప్రాంగణంలో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ గోవిందరాజ స్వామి ఆలయం 108 వైష్టవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించి 400 సంవత్సరాలు అవుతోంది. 50 ఏళ్ల క్రితం బ్రహ్మోత్సవాలకు నిర్ణయించినా, చివరి క్షణంలో అడ్డంకులు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవ వేడుకలను నిర్వహించేందుకు హిందూ దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ ఆలయ పాలక మండలికి చెందిన తిరు వెంగడం, సుదర్శనంను బ్రహ్మోత్సవ నిర్వహణ విషయంపై దేవదాయ శాఖ అధికారులు చర్చించారు. ఈసారి ఎలాగైనా బ్రహ్మోత్సవాలను నిర్వహించి తీరాలనే కాంక్షతో ఏర్పాట్లకు గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ వ్యవహారంపై దృష్టి పెట్టాలని చిదంబరం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, రెవెన్యూ డివిజన్‌ అధికారులను ఆదేశించారు. నివేదిక సమర్పించాలని సూచించారు.

మరిన్ని వార్తలు