ప్రాణం తీసిన రైల్వే గేట్‌ | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన రైల్వే గేట్‌

Published Fri, Nov 10 2023 5:28 AM

-

– మూర్చ రోగి మృతి

అన్నానగర్‌: రైల్వే గేట్‌ చాలా సేపుగా మూసి ఉండడంతో ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడంతో మూర్చ రోగి మృతి చెందిన ఘటన గురువారం సింగపెరుమాల్‌ కోయిల్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. చైన్నె సమీపంలోని సింగపెరుమాల్‌ కోయిల్‌ ప్రాంతంలో రైల్వే గేటు ఉంది. ఇక్కడ ఆస్పత్రి అత్యవసర సేవలకు రైల్వేగేటు దాటి వెళ్లవలసి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో సైతం రైల్వేగేటు మూసి ఉండడంతో అవతలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అక్కడి మరైమలైనగర్‌ సమీపంలో ఉన్న తిరుకత్తూరు మనుమేడు ప్రాంతానికి చెందిన వ్యక్తి బాలా. ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ అయిన ఇతనికి బుధవారం సాయంత్రం మూర్చకు గురయ్యాడు. దీంతో అతని బంధువులు వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్లడం కోసం ఆటోలో వెళ్లారు. అయితే సింగపెరుమాల్‌ కోవిల్‌ వద్ద రైల్వే గేటు మూసి ఉండడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. చాలా సేపటి వరకు రైల్వేగేటు తెరవకపోవడంతో ఆటోలో ఉన్న బాలా ప్రాణాలతో పోరాడాడు. దీంతో బంధువులు నలుగురు బాలాను చేతుల్లో మోసుకుని వాహనాల మధ్య రైల్వే పట్టాలు దాటి అవతలిపైవు మరో ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలాను పరీక్షించిన వైద్యులు అప్పటిలే అతను మృతిచెందినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా బాలాను బంధువులు మోసుకెళుతున్న దృశ్యాన్ని అక్కడి ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

Advertisement
Advertisement