వామ్మో ఇదేం ఫైటింగ్‌.. బస్టాండ్‌లో తన్నుకున్న విద్యార్థినులు

2 May, 2022 10:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: బస్టాండ్‌లో విద్యార్థినులు తన్నుకున్నారు. మగరాయుళ్లకు ఏమాత్రం తీసి పోమన్నట్టుగా సినీ స్టంట్‌లు చేశారు. విద్యార్థులు వ్యవహరిస్తున్న తీరుతో కౌన్సెలింగ్‌కు తగ్గ చర్యలపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తీరు వివాదాలకు, చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తిరునల్వేలిలో విద్యార్థుల గొడవలో ఓ విద్యార్ధి మరణాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అలాగే, కడలూరులో శుక్రవారం గొడవ పడ్డ 14 మంది విద్యార్థుల పై కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థినులు తగ్గేదేలేదన్నట్టుగా గొడవ పడిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది.  స్టంట్లతో మదురై పెరియార్‌ టౌన్‌ బస్టాండ్‌లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు హఠాత్తుగా ముష్టియుద్ధానికి దిగారు. తన్నులు తాళ లేక కొందరు పారిపోతున్నా, వెంటాడి మరీ మరి కొందరు విద్యార్థినులు కొట్టడం గమనార్హం.

ఈ దృశ్యాలన్నింటినీ అక్కడే ఉన్న విద్యార్థులు తమ మొబైల్‌ కెమెరాల్లో బంధించారు. అక్కడి ప్రయాణికులు వారిస్తున్నా, పట్టించుకోకుండా విద్యార్థినులు సాగించిన ఫైట్‌ దిగ్భ్రాంతి కలిగించింది. అర్ధ గంట తర్వాత రంగంలోకి పోలీసులు దిగడంతో విద్యార్థినులు పత్తా లేకుండా పోయారు. అయితే, విద్యార్థులు చిత్రీకరించిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫైట్‌ను ప్రోత్సహించే విధంగా మరి కొందరు విద్యార్థులు ఈల గోల చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. అక్కడ తన్నుకున్న విద్యారి్ధనులు అందరూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరికి కౌన్సెలింగ్‌కు ఇవ్వడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు.   

ఇది కూడా చదవండి: చిన్నారి కన్నీళ్లు తుడిచేవారెవరు?

మరిన్ని వార్తలు