షరియత్‌ స్థాపనే హెచ్‌యూటీ లక్ష్యం 

8 Jun, 2023 03:31 IST|Sakshi

ఓ వర్గానికి చెందిన ప్రార్థన స్థలాలు, ప్రముఖులే టార్గెట్‌ 

రద్దీ ప్రాంతాల్లోనూ భారీ పేలుళ్లకు కుట్ర 

ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన ఎన్‌ఐఏ 

ఈ ఉగ్రవాద సంస్థను నిషేధించే యోచనలో కేంద్రం  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పడగొట్టి షరియత్‌ స్థాపనే లక్ష్యంగా హిజ్బ్‌ ఉత్‌ తెహ్రీర్‌ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్ధారించింది. ఈ సంస్థకు చెందిన 16 మంది ఉగ్రవాదులను మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు గత నెల్లో హైదరాబాద్, భోపాల్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే.

ఎన్‌ఐఏ ఈ కేసును గత నెల 24న రీ–రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేపట్టింది. ఇస్లామిక్‌ రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా, అడ్డంకిగా ఉన్న ఓ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్‌గా చేసుకోవడంతోపాటు ప్రార్థన స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద దేశంలో దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

ప్రాంతాల వారీగా తన్జీమ్‌లు ఏర్పాటు 
దేశంలో ఉన్న ప్రభుత్వం ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, వారి హక్కుల కోసం పోరాడే సంస్థలపై నిషేధం విధిస్తూ, కార్యకర్తలను జైళ్లకు పంపుతోందని తమ కేడర్‌కు నూరిపోస్తోంది. దీనికి సంబంధించి ఆడియోలు, వీడియోలను రూపొందించి రాకెట్‌ చాట్, త్రీమా యాప్స్‌ ద్వారా ప్రచారం చేసింది. ఈ ఉగ్ర సంస్థ మధ్యప్రదేశ్, హైదరాబాద్‌ల్లో విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా తన్జీమ్‌గా పిలిచే మాడ్యుల్స్‌ ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్‌ఐఏ తేల్చింది. 

మధ్యప్రదేశ్‌ తన్జీమ్‌కు యాసిర్‌ ఖాన్, తెలంగాణ తన్జీమ్‌కు మహ్మద్‌ సలీం నేతృత్వం వహించారు. వీళ్లు మరింత మందిని తన సంస్థలో చేర్చుకుని వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి కుట్ర పన్నారు. ఈ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోలతోపాటు ఐఎస్‌ఐఎస్‌ రూపొందించే ఆన్‌లైన్‌ పత్రిక వాయిస్‌ ఆఫ్‌ హింద్‌ ప్రతులు, ఖలాఫతుల్లా అల్‌ మహదీపై ఉన్న పత్రాలు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్స్, ఏకే 47, 303 రైఫిల్‌తోపాటు వివిధ పేలుడు పదార్థాల ఫొటోలు, వాటి డాక్యుమెంట్లను రిట్రీవ్‌ చేశారు. 

హైదరాబాద్‌లోనే కీలక నిర్ణయాలు 
మధ్యప్రదేశ్, తెలంగాణ తన్జీమ్‌లకు చెందిన 17 మంది ఉగ్రవాదులు గతేడాది హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గోల్కొండ ప్రాంతంలోని సలీం ఇంట్లో జరిగిన ఈ మీటింగ్‌లోనే భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అధికారులు తేల్చారు. సలీం సహా హైదరాబాద్‌ తన్జీమ్‌కు చెందిన ఆరుగురూ ఆపరేషన్స్‌ చేయడానికి సిద్ధమవుతూ శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్‌ తన్జీమ్‌కు సంబంధించి జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది.   

మరిన్ని వార్తలు