ట్రాఫిక్‌లో కుయ్‌ కుయ్‌!

24 Feb, 2021 14:08 IST|Sakshi

అంబులెన్సుల్లోనే ప్రసవాలు.. చికిత్సలు

నిర్దేశిత సమయానికి చేరుకోని వైనం

ఘటనా స్థలానికి మరో వాహనంలో..

ఆందోళనకు గురవుతున్న బాధితులు 

సాక్షి, సిటీబ్యూరో: ఆపద సమయంలో ఫోన్‌ చేస్తే కుయ్‌.. కుయ్‌మంటూ పరుగెత్తుకువచ్చే 108 సహా ఇతర అంబులెన్స్‌ సర్వీసులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ఇరుకు రహదారులకు తోడు అత్యవసర సర్వీసులకు దారి ఇవ్వాలనే స్పృహ ప్రయాణికుల్లో లేకపోవడంతో నిర్దేశిత సమయానికి ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీని దాటుకుని ఘటనా స్థలికి చేరుకునేలోపే ప్రైవేటు వాహనాల్లో క్షతగాత్రులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రికి చేరుకోలేక కొంత మంది క్షతగాత్రులు మృతిచెందుతున్నారు. మరికొందరు దారి మధ్యలో అంబులెన్స్‌ల్లోనే కన్నుమూస్తున్నారు.
 
బాధితుల బలహీనతే.. వారికి బలం.. 
గ్రేటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న 108 సర్వీసులు 74 ఉన్నాయి. ప్రైవేటుగా మరో వెయ్యి సర్వీసుల వరకు ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల నుంచి రోజుకు 250 నుంచి 300 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. వీటిలో సగం కాల్స్‌కు మాత్రమే సర్వీసులు అందుతున్నాయి. 108 ఇతర అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని తెలిసి కూడా చాలా మంది వాహనదారులు పక్కకు జరగడం లేదు. ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ 40 నిమిషాలైనా రావడం లేదు. బాధితుల బంధువులు అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బాధితుల్లో ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు.   

ట్రాఫిక్‌ చిక్కుల్లో సర్వీసులు.. 
గర్భిణులను ప్లేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రులకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ఉస్మానియా, నిమ్స్‌లకు ఎక్కువగా తరలిస్తుంటారు. నెలలు నిండకుముందు తక్కువ బరువుతో జని్మంచిన శిశువులను నిలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తుంటారు. ఎల్బీనగర్, బడంగ్‌పేట్, సంతోష్‌ నగర్, చాంద్రాయణగుట్ట నుంచి వచ్చే అంబులెన్స్‌లకు మలక్‌పేట్, చాదర్‌ఘాట్‌ వంతెనపై ట్రాఫిక్‌  చిక్కులు తప్పడం లేదు.  

ఘట్‌కేసర్, నారపల్లి, చర్లపల్లి తదితర శివారు ప్రాంతాల నుంచి వచ్చే బాధితులను గాం«దీకి ఎక్కువగా తరలిస్తుంటారు. ఇక్కడి నుంచి వాహనాలకు బోడుప్పల్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. ఇక్కడ ఫ్లైఓవర్‌ పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది.

ఉప్పల్‌ నుంచి వచ్చే వాహనాలకు అంబర్‌పేట, చే నంబర్‌ వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకైన ఈ రోడ్డుపై ఉన్న భారీగా నిలిచిన ట్రాఫిక్‌ రద్దీని దాటుకుని ఆస్పత్రులకు వెళ్లడం అంబులెన్స్‌లకు పెద్ద సమస్యగా మారింది.  

కూకట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలకు అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలో నిలిచిపోతున్నాయి. కుయ్‌ కుయ్‌ అంటూ ఎంత మొత్తుకున్నా.. ముందు ఉన్న వాహనాలు ఎటూ కదలని దుస్థితి నెలకొంది.  

మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలకు జేన్‌టీయూహెచ్‌ వద్ద ఇబ్బందులు తప్పడం లేదు.  

రోడ్డుపై ఉన్న వాహన దారుల్లో చాలా మందికి అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలనే స్పృహ కూడా ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా.. అప్పటికే ఇరుకు రోడ్డుపై ఇసుకేస్తే రాలనన్నీ వాహనాలు ఉంటాయి. ఫలితంగా సరీ్వసులు బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చలేకపోతున్నాయి.
    

గ్రేటర్‌లో 108 సర్వీసులు ఇలా 
    జిల్లా                అంబులెన్సులు 
    హైదరాబాద్‌     24         
    రంగారెడ్డి         27 
    మేడ్చల్‌          21 
ఏ నెలలో ఎన్ని కేసులు తరలించారు  
    నవంబర్‌      2700 
    డిసెంబర్‌      2767 
    జనవరి        2830  

మరిన్ని వార్తలు