ప్రసవాల్లో సరికొత్త రికార్డు

6 Sep, 2023 04:44 IST|Sakshi

ఆగస్టు నెలలో 76.3% డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే..

ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం: హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు నెలలో నమోదైన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, ఇది ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో సరికొత్త రికార్డు అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు, ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు.

ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి నెలవారీ సమీక్షను నిర్వహించారు. 

అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రిలో 89%
అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రి 89 శాతం, ములుగు 87, మెదక్‌ 86, భద్రాద్రి కొత్తగూడెం 84, వికారాబాద్‌ 83, గద్వాల ఆస్పత్రి 85 శాతం ప్రసవాలతో మంచి పనితీరు కనబర్చాయని హరీశ్‌రావు అభినందించారు. అతి తక్కువగా డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్‌ (66), మేడ్చల్, కరీంనగర్‌ (67) జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనితీరు మెరుగుపడాలన్నారు.

మొత్తంగా మంచి సామర్థ్యపు స్కోర్‌ విషయంలో తొలి వరుసలో నిలిచిన మెదక్‌ (84.4), జోగుళాంబ గద్వాల (83.9), వికారాబాద్‌ (81), ములుగు (79), నాగర్‌కర్నూల్‌ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానాల్లో ఉన్న జగిత్యాల, కొమురంభీం, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.   

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.

ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్‌ కిట్‌ డేటా ఆధారంగా డెలివరీ డేట్‌ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు