సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత | Sakshi
Sakshi News home page

సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత

Published Wed, Sep 6 2023 4:44 AM

Support to micro food processing industries - Sakshi

సాక్షి. అమరావతి: రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు అటు రైతులను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేయడం, ఇటు యువతకు ఉపాధి కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పం. రాష్ట్ర ప్రగతికి తోడ్ప­డే ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. 35 శాతం సబ్సిడీతోపాటు కేవలం 6 శాతం వడ్డీకే రుణాలు లభించేలా ఏర్పాట్లు చేసింది.

ఈ యూనిట్లకు రుణాలిచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. ఈమేరకు మంగళవారం సచివాలయంలో ఎస్‌బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి సమక్షంలో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్‌) సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎం) వి.హేమ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. 

రూ. 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు 
ఈ ప్రాజెక్టు కింద  రూ.10లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 35 శాతం సబ్సిడీపై ఎస్‌బీఐ రుణం మంజూరు చేస్తుంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి అంచనా వ్యయంతో పెట్టే యూనిట్లకు మాత్రం పూచీకత్తుతో రుణాలు మంజూరు చేస్తారు. సబ్సిడీ 35 శాతం లేదా గరిష్టంగా రూ.10 లక్షలుగా నిర్ణయించారు. తాజా ఒప్పందం ద్వారా కనీసం 7,500 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఆధునికీకరణ, స్థాపనకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కుల, మత, లింగ భేదాల్లేకుండా 18 ఏళ్లు పైబడిన వారెవరైనా వ్యక్తిగత యూనిట్లు పెట్టుకోవచ్చు.

యూనిట్‌ వ్యయంలో లబ్దిదారులు 10 శాతం వాటాగా భరిస్తే తొలుత 90 శాతం రుణంగా ఎస్‌బీఐ మంజూరు చేస్తుంది. రుణ ప్రక్రియ పూర్తి కాగానే ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీ జమ చేస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఎఐఎఫ్‌) కింద అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే 6 శాతం వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయి. అంతేకాదు యూనిట్‌ ప్రారంభ దశలో 3 నెలలపాటు మారటోరియం వ్యవధి ఉంటుంది.

ఈ ప్రాజెక్టు కింద వ్యక్తిగతంగానే కాకుండా  రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూడా సూక్ష్మ ఆహార శుద్ధి ప్రాజెక్టుల విస్తరణకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా అనకాపల్లి బెల్లం, గువ్వలచెరువు పాలకోవా, మాడుగుల హల్వా వంటి సంప్రదాయ ఆహార క్లస్టర్లలోని మైక్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను అత్యాధునిక యంత్రాలతో అప్‌గ్రేడ్‌ చేయవచ్చు. గతేడాది రూ.8 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటైన 500 యూనిట్లకు 55 శాతం సబ్సిడీపై ఎస్‌బీఐ ఆర్థిక చేయూతనిచ్చి ంది.

ఆహారశుద్ధి పరిశ్రమల విస్తరణ మరింత వేగం:  చిరంజీవి చౌదరి 
రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చిరంజీవి చౌదరి చెప్పారు. ఇటీవలే సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్లకు ఆరి్ధక చేయూతనిచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పుడు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌బీఐతో కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సానుకూల ప్రభావం చూపు­తుందన్నారు.

సొసైటీ సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరం 500 యూనిట్లకు రుణాలిచ్చిన ఎస్‌బీఐ.. ఇప్పుడు పెద్ద ఎత్తున యూనిట్ల విస్తరణ­కు ప్రధాన రుణభాగస్వామిగా ఉద్భవించడం శుభపరిణామమన్నారు. పూచీకత్తు లేకుండా రూ.10లక్షల వరకు రుణాలిస్తామని ఎస్‌బీఐ డీజీఎం హేమ చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో  ఏ­ర్పా­టయ్యే యూనిట్లకు మద్దతు ఇస్తామన్నా­రు. ఈ కార్యక్రమంలో సొసైటీ డిప్యూటీ సీఈవో ఈ.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement