వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?

6 Jan, 2021 13:33 IST|Sakshi

హుస్నాబాద్‌లో 8 నెమళ్ల మృతిపై ఎన్నో అనుమానాలు

శాంపిల్స్‌ సేకరించిన అధికారులు

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం నాగారం గ్రామ సమీపంలో ఎనిమిది నెమళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేగింది. వేటగాళ్ల ఉచ్చులో పడ్డాయా? లేక బర్డ్‌ఫ్లూ వ్యాధితో చనిపోయాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. రెండేళ్లు సమృద్ధిగా వర్షాలు కురవడంతో హుస్నాబాద్‌ ప్రాంతంలో పంట పొలాలు, పచ్చటి అడవుల విస్తీర్ణం పెరిగింది. దీంతో నెమళ్ల సంఖ్య పెరిగింది. అయితే.. నెమళ్లు మృత్యువాత పడటం పలు అనమానాలకు తావిస్తోంది. పంటలు కోతకొచ్చే సమయంలో వాటిపై చల్లిన విషపు గుళికలు, రసాయనాలు కలిపిన నీళ్లు తాగడంతో మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అలాంటప్పుడు నెమళ్లు మృతి చెందే అవకాశం లేదని చెబుతున్నారు. వేటగాళ్లు వేరుశనగ, మొక్కజొన్న గింజలకు విషపదార్థాలు కలిపి నెమళ్లు సంచరించే ప్రదేశంలో చల్లడంతోనే వాటిని తిని మృత్యువాత పడ్డాయనే ప్రచారం జరుగుతోంది.
 
మాంసం సరఫరాపై ఆరా.. 
కొంత కాలంగా జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాల్లో నెమలి మాంసం దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది. దాబాలకు నెమలి మాంసం సరఫరా చేసే వేటగాళ్లే ఈ పాపానికి ఒడిగట్టి ఉంటారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి అడవి పంది, కుందేలుతో పాటు, నెమలి మాంసం కూడా సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెమలి మాంసం ప్రియం గా ఉండటంతో అధిక లాభాలు గడించేందుకు వేటగాళ్లే ఈ పని చేసి ఉంటారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకితే వందల సంఖ్యలో పక్షులు మృతి చెందుతాయని, హుస్నాబాద్‌లో చనిపోయిన నెమళ్లు వేటగాళ్లు ఎరవేసిన విషం కలిపిన గింజలు తినే చనిపోయాయని పలువురు స్థానికులు అంటున్నారు. 

శాంపిల్స్‌ సేకరించాం
అనుమానాస్పదంగా మృతి చెందిన 8 నెమళ్లకు మంగళవారం పోస్టుమార్టం చేశాం. నెమళ్ల కడుపులో మొక్కజొన్న గింజలు ఉన్నాయి. శాంపిళ్లను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిస్తాం. ఇరవై రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా నెమళ్లు ఎలా మృతి చెందాయో నిర్ధారించొచ్చు. 
– డాక్టర్‌ విజయ్‌ భార్గవ్, పశువైద్యాధికారి, హుస్నాబాద్‌ 
 

మరిన్ని వార్తలు