‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్‌ యాత్ర ప్రక​టించాడా?

4 Jan, 2023 11:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరగబోయే శిక్షణా తరగతులకు సీనియర్లు హాజరు కావడంపై సస్పెన్స్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పరిణామంపై ఏఐసీసీ సభ్యులు బోసు రాజు స్పందించారు. 

ఇది ఏఐసీసీ కార్యక్రమం అందరూ హాజరు కావాల్సిందేనని బోసు రాజు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కొంతమంది సీనియర్లు పార్టీలోని వివిధ కార్యక్రమాల్లో ఉన్నారని ఏఐసీసీ నేత బోస్‌రాజు తెలిపారు. ఉత్తమ్‌ డిఫెన్స్‌ కమిటీ సమావేశానికి వెళ్లారు. శ్రీధర్‌బాబు కర్ణాటక పీసీసీ మీటింగ్‌కు వెళ్లారు. మరికొందరు ఇతర కార్యక్రమాల్లో ఉన్నారని తెలిపారు. పార్టీ ప్రెసిడెంట్‌ ఖర్గే ఎవరికి ఫోన్‌ చేశారనేది తన దగ్గర సమాచారం లేదని చెప్పారు. ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అసలు తనకు పిలుపు రాలేదన్న కామెంట్‌పై.. ఆయనతో మాట్లాడాల్సి ఉందని చెప్పారాయన.

ఇక కాంగ్రెస్‌ ప్రతి ఇంటికి చేరేందుకే హాత్‌ సే జోడో అభియాన్‌ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. హాత్‌ సే హాత్‌ అభియాన్‌పై కార్యచరణ రూపొందిస్తామని బుధవారం ఆయన తెలిపారు. సీనియర్ల సమస్యకు, ఈ సదస్సుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. నిన్న(మంగళవారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాకు ఫోన్‌ చేశారు. హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ సన్నాహాక సమావేశంలో పాల్గొనాలని చెప్పారని వివరించారు. 

ఇదిలా ఉంటే.. రేవంత్‌ రెడ్డి చేపట్టబోయే యాత్రపై సీనియర్లు భిన్నంగా స్పందించారు. రేవంత్‌ యాత్ర చేపట్టబోతున్నారా? యాత్ర ప్రకటించాడా? అని బోస్‌రాజు ఎదురు ప్రశ్నించగా, యాత్రపై స్పందించేందుకు భట్టి నిరాకరించడం విశేషం. రేవంత్‌ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు, వ్యవహార శైలితో ఆయన పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్లు కొందరు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. 

పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో సమావేశం జరగనుంది. ధరణి పోర్టల్‌పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్‌సే హాత్‌జోడో యాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చించనున్నారు. సాయంత్రం కల్లా సీనియర్ల వ్యవహారశైలిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు